ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు!
ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నాయకులపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరడా ఝుళిపించనుంది. అందులోభాగంగా ఇప్పటికే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వరరావులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనేందుకు అధిష్టానం ఉపక్రమించింది. సదరు నేతలు ఇద్దరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి ఇప్పటికే అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్కు నివేదిక అందజేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వారిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సన్నద్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో పాల్వాయి కుమార్తె స్రవంతి మునుగోడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సైతం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో వారిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధిష్టానం రంగం సిద్ధం చేస్తుంది.