మళ్లీ ప్రచార హోరు
కేపీహెచ్‌బీ కాలనీ, న్యూస్‌లైన్ : ఎన్నికల పోరు.. ప్రచార హోరు.. మళ్లీ మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కూకట్‌పల్లి నియోజకవర్గంలో 13న రీపోలింగ్ నిర్వహించనుండటంతో ఆయా ప్రాంతాల్లో మళ్లీ ఎన్నికల సందడి నె ల కొంది. ‘ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు రాబోతున్నాయి.. నేనే గెలుపొందే అభ్యర్థిన ని’ కూకట్‌పల్లి నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థులు ఆశల పల్లకిలో ఊరేగుతుండగా... నియోజకవర్గంలోని 371/ఎ కేంద్రంలో రీ పోలీంగ్ అంటూ ఎన్నికల కమిషన్ చేసిన ప్రక టించడంతో అభ్యర్థులు మళ్లీ ప్రచార బాట పట్టారు.
ఆదివారం ఉదయమే రీ పోలింగ్‌లో పాల్గొనే కాలనీల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. కాలనీలకు చెందిన సంక్షేమ సంఘం నాయకులను, మహిళా సంఘం నాయకురాళ్లను, యువజన సంఘాలను కలిసి ఓట్లను అభ్యర్థించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి జంపన ప్రతాప్ ఓటర్లను కలవడంలో ముందంజలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి మాదవరం కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముద్దం నర్సింహ్మ యాదవ్, తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అభ్యర్థి కూరపాటి శ్రీనివాసరాజు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం అధికారుల నుంచి అనుమతి పొంది పెద్ద ఎత్తున కార్యకర్తలతో ప్రచారం నిర్వహించనున్నారు. సోమవారం ఒక్కరోజే రీ పోలీంగ్ ప్రాంతాలలో ప్రచారం చేసుకోవడానికి గడువుంది.
ఓటర్లంతా ఓటేయాలి
కూకట్‌పల్లి, న్యూస్‌లైన్: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని పోటీలో గల అభ్యర్థులు, ఏజెంట్లతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.వి. గంగాధర్‌రెడ్డి ఆదివారం సమావేశం నిర్వహించారు. 13వ తేదీన నిర్వహించే రీ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వసంత్‌నగర్ కాలనీలోని ఐడీపీఎల్ ఎంప్లాయీస్ సొసైటీ లైబ్రరీ హాల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రీ పోలింగ్ పరిధిలో గల ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అభ్యర్థులు రీపోలింగ్‌కు సహకరించాలని కోరారు.