లక్ష్మీదేవిపల్లి(కొత్తగూడెం), న్యూస్‌లైన్: కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణం పాత కొత్తగూడెంలో మంగళవారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు కొనసాగింది. 81.35శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1008 మంది ఓటర్లకుగాను 820 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 188 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఏప్రిల్ 30వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఈ బూత్‌లో 785 ఓట్లు మాత్రమే పోల్ కాగా ఈసారి 820కి పెరిగాయి. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటర్లు భారీ సంఖ్యలో బారులు తీరి ఓటేశారు. అనంతరం ఎండ పెరుగుతుండడంతో మందకొడిగా పోలింగ్ నమోదైంది.
తిరిగి సాయంత్రం సమయంలో ఓటర్లు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. పోలీసులు పహారా నడుమ ఈ రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూశారు.
పోలింగ్ కేంద్రం సమీపంలో అభ్యర్ధుల పాట్లు...
పోలింగ్ కేంద్రం సమీపంలో ఉదయం నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో అభ్యర్ధులు, పోలింగ్ ఏజెంట్లు ప్రచారం చేసుకోవాల్సి ఉండగా నిబంధనలు అతిక్రమించారని ఒకరిపై మరొకరు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి నెలకొంది. చివరికి పోలీసుల సూచనలు పాటిస్తూ అక్కడి నుంచి దూరంగా వెళ్లారు.
జల్లివారిగూడెంలో ప్రశాంతంగా..
వీఆర్‌పురం : మండలంలోని జల్లివారిగూడెంలో మంగళవారం నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 488 మంది ఓటర్లకు 423 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 86 శాతం పోలింగ్ నమోదైనట్లు తహశీల్దార్ మారుతీరావు తెలిపారు. గత నెల 30వ తేదీన స్థానిక పోలింగ్ కేంద్రంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లోని ఎమ్మెల్యే అభ్యర్థికి చెందిన ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రీపోలింగ్‌కు ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో మంగళవారం ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రమే స్థానిక పోలింగ్ కేద్రంలో రీపోలింగ్ నిర్వహించారు. ఈ కేంద్రంలో మొదటిసారి నిర్వహించిన ఎన్నికల్లో 488 మంది ఓటర్లు ఉండగా 217 మంది పురుషులు, 209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తొలిసారి 87 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి 86 శాతం నమోదైంది.
పోలింగ్ కేంద్రానికి అభ్యర్థుల తాకిడి
జల్లివారిగూడెం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రీపోలింగ్‌కు బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులందరూ వచ్చారు. ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రంలో సుమారు 488 ఓట్లు ఉండటంతో అవి తమ మెజార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించి ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌లు ఉదయాన్నే ఈ గ్రామానికి చేరుకున్నారు. సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య, టీడీపీ అభ్యర్థిని ఫణీశ్వరమ్మ, కాంగ్రెస్ అభ్యర్థిని కుంజా సత్యవతి, టీఆర్‌ఎస్ అభ్యర్ధి మానె రామకృష్ణ, స్వతంత్ర అభ్యర్థి సున్నం వెంకట రమణ తదితరులు ఈ ఎన్నికల కేంద్రాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.
ప్రశాంతంగా రీపోలింగ్
Published Wed, May 14 2014 4:27 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM
Advertisement