సాక్షి, మంచిర్యాల: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై హస్తం పెద్దలు హస్తినలో చేస్తున్న కసరత్తు కొలిక్కివస్తోంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ఒకటి, రెండు రోజుల్లో జాబితా ప్రకటించేందుకు ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణలే కీలక భూమికను పోషిస్తున్నట్లు సమాచారం. పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని మాదిగ ఉప వర్గానికి, ఆదిలాబాద్‌ను ఆదివాసీలకు కేటాయించేందుకు సూచనప్రాయంగా నిర్ణయించినట్లు పార్గీ వర్గాల భోగట్టా. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిత్వాలతో ఈ కేటగిరి మారే అవకాశం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వాలపై చివరి నిమిషం వరకు సాగదీయడం కూడా ఓటమికి ఒక కారణమనే భావనతో ఉన్న పెద్దలు, ఎంపీ అభ్యర్థుల జాబితాను త్వరగా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు.
ఆరెపల్లి...చంద్రశేఖర్...కవ్వంపల్లి!
పెద్దపల్లి లోకసభ స్థానానికి పలువురు పోటీ పడుతున్నా.. చివరగా ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ రిజర్వ్ స్థానమైన పెద్దపల్లి టికెట్టును ఈసారి మాదిగ ఉపకులానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో టికెట్ల కేటాయింపు ఆధారంగా పెద్దపల్లిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు. ఈ స్థానం నుంచి పార్టీకి దరఖాస్తు చేసుకున్న మాజీ విప్ ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్, కవ్వంపల్లి సత్యనారాయణలు ముందువరుసలో ఉన్నారు. అభ్యర్థిత్వంపై వీరిలో ఒకరిద్దరికి ఏఐసీసీ నుంచి ఫోన్లు కూడా వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈసారి మాదిగ ఉపకులానికి పెద్దపల్లి స్థానాన్ని కేటాయించాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ నేతలు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆ కేటగిరికి చెందిన నేతల్లో ఆశలు చిగురించాయి.
రాథోడ్ రమేష్... సోయం బాపూరావు... నరేష్ జాదవ్!
ఆదిలాబాద్ లోకసభ స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీ కాస్త అధికంగానే ఉంది. ఎస్‌టీ రిజర్వ్ అయిన ఈ స్థానం నుంచి ఆదివాసీ, లంబాడా తెగలకు చెందిన నాయకులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోకసభ స్థానాలకు గాను ఆదిలాబాద్, మహబూబాబాద్ నియోజకవర్గాలు ఎస్‌టీ రిజర్వ్‌లో ఉన్నాయి. ఇందులో ఒకటి ఆదివాసీకి, మరొకటి లంబాడాలకు ఇవ్వాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలున్నట్లు సమాచారం. ఈ లెక్కన మహబూబాబాద్ టికెట్ ఆదివాసీలకు ఇస్తే ఆదిలా బాద్ స్థానం లంబాడా తెగకు చెందిన నాయకులకు దక్కే అవకాశం ఉంది. అలాకాకుండా మహబూబాబాద్‌లో లంబాడాలకు అవకాశం ఇస్తే, ఆదిలాబాద్ టికెట్ ఆదివాసీలకు దక్కనుంది. కాగా ఆదిలాబాద్ స్థానానికి ఆదివాసీల నుంచి సోయం బాపూరావు, లంబాడా నుంచి రమేష్ రాథోడ్, నరేశ్‌జాదవ్‌లు టికెట్ రేసులో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపిక కూడా కాంగ్రెస్ టికెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఒకటి, రెండు రోజుల్లో ఖరారు?
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఒకటి, రెండు రోజుల్లో ఖరారు కానున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారులో జరిగిన విపరీత జాప్యం కూడా పార్టీని కొంపముంచిందని నేతలు పార్టీ సమావేశాల్లో బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటును పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కానీయరాదని అధిష్టానం కూడా భావిస్తున్నట్లు సమాచారం. లోకసభ ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో రెండు, మూడు రోజుల్లో టికెట్లు ఖరారు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన పార్టీ, వివాదాలకు తావులేని నియోజకవర్గాలతో తొలిజాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది. గురు, శుక్రవారాల్లో అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment