సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి టికెట్ ఆశించిన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆరెపల్లి మోహన్ తిరుగుబావుటా ఎగరేశారు. ఆయన కాంగ్రెస్‌ను వీడి, అధికార టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాకుచెందిన మంత్రులతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిసింది. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కూడా భేటీ అయి.. భేషరతుగా టీఆర్‌ఎస్‌లో చేరి మద్దతిచ్చేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశంలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్‌లో చేరే విషయాన్ని ప్రకటించాలని భావించారు. ఈ మేరకు మీడియాను కూడా ఆహ్వానించారు. అయితే ఈ విషయం తెలిసి కాంగ్రెస్ నాయకులు ఆరెపల్లి మోహన్ నివాసానికి రావడంతో సమావేశాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం కరీంనగర్‌లో జరిగే కేసీఆర్ బహిరంగసభలోనే పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే వ్యూహాత్మకంగా పెద్దపల్లి సభలో పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఎవరీ చంద్రశేఖర్..? అభ్యర్థులే కరువయ్యారా?
పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పలువురు నాయకులు టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గణనీయంగా ఓట్లు పోలు కావడం.. పార్లమెంట్ పరిధిలోని మంథని, రామగుండంలో టీఆర్‌ఎస్ సిట్టింగులు ఓడిపోవడంతో రాష్ట్రంలోని పలువురు నాయకులు ఈ సీటుపై కన్నేశారు. 32 మంది నాయకులు ఈ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో గతంలో రాష్ట్రంలో కీలకమైన పదవులు నిర్వహించిన వారూ ఉన్నారు. ఎస్సీల్లోని సామాజిక సమీకరణాల నేపథ్యంలో పెద్దపల్లి సీటును మాదిగకు కేటాయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో మాదిగ వర్గానికి చెందిన ఆరెపల్లి మోహన్, కవ్వంపల్లి సత్యనారాయణ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే పీసీసీ నేతలతో ఉన్న సంబంధాలతో వికారాబాద్‌కు చెందిన మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ ఢిల్లీ స్థాయిలో పైరవీ నడిపి టికెట్ తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రశేఖర్ ఎవరో పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో సీనియర్ రాజకీయ నాయకులకు తప్ప ఇప్పుడెవరికీ తెలియదు. ప్రజలతోగానీ.. ఈ ప్రాంతంతోగానీ సంబంధాలే లేవు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ తొలి జాబితాలో చంద్రశేఖర్ పేరు చోటుచేసుకోవడం కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేసిన తనను కాదని రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకుడికి సీటివ్వడాన్ని ఆరెపల్లి మోహన్ జీర్ణించుకోలేకపోయారు. పార్టీని వదలాలని నిర్ణయించుకున్నారు.
ఫలించని జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు రాయభారం
కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఆదివారం పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న టి.జీవన్‌రెడ్డికి మద్దతుగా ఏర్పాటుచేసిన సమావేశానికి మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం తది తరులు హాజరయ్యారు. సమావేశానికి ఆరెపల్లి మోహ న్ కూడా వస్తారని భావించినా ఆయన రాలేదు. సమావేశం జరుగుతున్న సమయంలోనే సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు విలేకరులకు సమాచారం వచ్చింది. విషయం తెలుసుకున్న జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు హుటాహుటిన ఆరెపల్లి మోహ న్ ఇంటికి వెళ్లారు.
ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కతో ఫోన్‌లో మాట్లాడించారు. ‘ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. నీకు ఏం చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది’ అని సముదాయించారు. అవేమీ పట్టించుకోని మోహన్ విలేకరుల సమావేశాన్ని రద్దు చేసినట్లు చెబుతూ హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం రాత్రి ఎ.చంద్రశేఖర్‌కు సీటు ఖరారైన తరువాత టీఆర్‌ఎస్ నేతలు మోహన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీ వినోద్, ఓ మంత్రితో సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆదివారం నాటి కేసీఆర్ సభలో మోహన్ పార్టీలో చేరబోరని, విడిగా ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ కండువా కప్పుకుంటారని జిల్లాకు చెంది న ఓ టీఆర్‌ఎస్ ప్రముఖుడు తెలిపారు. మోహన్ బాట లోనే పెద్దపల్లి లోక్‌సభకు చెందిన పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment