
సాక్షి, సంగారెడ్డి : ప్రజా సేవలో ప్రజాప్రతినిధులకు విశ్రామం ఉండదని, నాయకుడు నిత్య శ్రామికుడై పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం సంగారెడ్డిలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఎన్నికలు ముగియడంతో కార్యకర్తల బాధ్యత తీరి, ప్రజాప్రతినిధుల బాధ్యత ప్రారంభమైందన్నారు. ప్రజా ప్రతినిధులకు ఆదివారం, రెండో శనివారం సెలవులంటూ ఏమి ఉండవని, నిత్య సేవకుడై ప్రతి రోజూ పనిచేయాలన్నారు. ఎదిగే కొద్ది ఒదుగుతూ.. ప్రజలకు సేవ చేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ఇక ప్రతిరోజు పండగేనన్నారు. భువనగిరిలో రోడ్ రోలర్ గుర్తు వల్ల టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చే దిశగా పని చేద్దామని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కార్యకర్తలు లేనిదే నాయకులు లేరు : ప్రభాకర్ రెడ్డి
పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష వల్లే తాను మరోసారి పార్లమెంట్‌కు వెళున్నానని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు లేనిదే నాయకులు లేరన్నారు. హరీశ్ రావు నిర్దేశంలో పకడ్బందీగా ప్రచారం చేశామని, ప్రతి కార్యకర్త టీమ్ లీడర్‌లా పనిచేశారని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment