టీఆర్‌ఎస్ నేత హరీష్ రావు(పాత చిత్రం)
దుబ్బాక: తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ కేసులు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిపైనే ఉన్నాయని టీఆర్‌ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హరీష్ రావు, మెదక్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. రోజుకొక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.
తెలంగాణా ప్రజలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూసిందని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దిక్చూచిగా తెలంగాణా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ఓటు వేసి ఢిల్లీ చుట్టూ తిరుగుడు అవసరం లేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్ర నిథులు ముక్కు పిండి రాబట్టవచ్చునని అన్నారు. వచ్చే నెల 3న నర్సాపూర్‌లో కేసీఆర్ సభ ఉందని, అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్తప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గాలిలో కొట్టుకుపోవడం ఖాయం: పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గాలిలో కొట్టుకుపోవడం ఖాయమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాస్యమాడారు. దుబ్బాకలో చెల్లని రూపాయి అయిన రఘునందన్ రావు మెదక్‌లో చెల్లడం సాధ్యమా అని ప్రశ్నించారు. తెలంగాణాలో టీఆర్‌ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి పుట్టగతులు లేవని, 16 ఎంపీ సీట్లు గెలిచినట్లయితే ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కీలకమవుతుందని మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment