అంతర్మథనం..  | TRS Trial In Lok Sabha Election Results | Sakshi
Sakshi News home page

 అంతర్మథనం.. 

Published Sat, May 25 2019 1:00 PM | Last Updated on Sat, May 25 2019 1:00 PM

TRS Trial In Lok Sabha Election Results - Sakshi

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు స్థానాలను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నా మెజారిటీ తగ్గడంపై ఆ పార్టీ నేతలు అంతర్మథనం చేసుకుంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్, వందలాది మంది స్థానిక ప్రజాప్రతినిధులు, వేలాదిగా కార్యకర్తలు, ఇంత బలం.. బలగం ఉన్నా జహీరాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో అతి తక్కువ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవడం ఆ పార్టీ నేతలకు ఒకింత ఆశ్చర్యాన్ని, అసహనాన్ని కలుగజేశాయి. గతం కంటే భారీగా తగ్గిన మెజారిటీపై శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. గత సంవత్సరం డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సంగారెడ్డి సెగ్మెంట్‌ మినహా మిగతా తొమ్మిదింటిలో గులాబీ గుబాళించినా ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఆ ఆధిక్యత కనిపించలేదు.

సంగారెడ్డి: అసెంబ్లీ సెగ్మెంట్‌లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన జగ్గారెడ్డి కేవలం 2వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని బట్టి చూస్తే భారీ మెజారిటీతో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లో కైవసం చేసుకుంటామని టీఆర్‌ఎస్‌ నేతలు పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ తరువాత కూడా ధీమా వ్యక్తం చేశారు. తీరా ఓట్ల లెక్కింపును బట్టి చూస్తే మెదక్‌లో కొత్త ప్రభాకర్‌ రెడ్డికి కొద్దిగా మెజారిటీ తగ్గినప్పటికీ 3,16,427 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జహీరాబాద్‌లో మాత్రం ఆశించిన మెజారిటీ రాకపోవడంతో అభ్యర్థి బీబీ పాటిల్‌తోపాటుగా పార్టీ నేతలంతా ఖంగుతిన్నారు.

జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బీబీ పాటిల్‌ స్పల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై కేవలం 6,229 ఓట్ల తేడాతో గెలిచారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 4,34,244 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుకు 4,28,015 ఓట్లు వచ్చాయి. ఆద్యంతం చివరి రౌండు వరకు ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్‌లో ఎట్టకేలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాటిల్‌ గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసిన పాటిల్‌ 1,44,631 ఓట్లతో ఘన విజయం సాధించారు.

జహీరాబాద్‌ పార్లమెంటు సెగ్మెంట్‌లోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గం తప్ప గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఎల్లారెడ్డి సెగ్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన జాజాల సురేందర్‌ సైతం లోక్‌సభ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయి మద్దతునిచ్చారు. దీంతో సెగ్మెంట్‌లోని ఏడుగురు ఎమ్మెల్యేలు సైతం అధికార పార్టీవారే ఉండడంతో భారీ మెజారిటీ ఖాయమని భావించారు. అయితే ఓటర్లు మాత్రం విలక్షణమైన తీర్పునిచ్చారు. బీబీ పాటిల్‌ కేవలం 6,229 ఓట్ల తేడాతో విజయం సాధించడంతో పార్టీ అభ్యర్థితో పాటుగా ఉమ్మడి జిల్లా అధికార పార్టీ నేతలు ఖంగుతిన్నారు. ఎక్కడ లోపం జరిగిందంటూ కారణాలు అన్వేషించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా నేతలు, అభ్యర్థులతో సీఎం కేసీఆర్‌ ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జహీరాబాద్‌లో మెజారిటీ తగ్గడానికి కారణాలేమిటో అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

జహీరాబాద్‌ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌కు భారీ లీడ్‌
గత సంవత్సరం డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాణిక్‌రావుకు 34వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ లభించింది. గత నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ సంఖ్య కొంచెం అటు ఇటుగా పునరావృతమవుతుందని ఎమ్మెల్యేతో సహా పార్టీ నేతలు భావించారు. కాగా ఆర్నెళ్లు తిరగకముందే ఓట్ల తేడాలో భారీ వ్యత్యాసమొచ్చింది. జహీరాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి 23,559 ఓట్ల భారీ ఆధిక్యం లభించింది. అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి 16,421 ఓట్లు,  ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో 8,397 లభించాయి. టీఆర్‌ఎస్‌కు అందోల్‌లో 9,778, నారాయణఖేడ్‌లో 9,365, జుక్కల్‌లో 15,780, బాన్సువాడలో 20,060 ఓట్ల మెజారిటీ లభించింది. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ 6,229 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి మొత్తం 14,11,612 మంది ఓటర్లు ఉండగా, 11,88,780 ఓట్లు  84.21 శాతంతో పోలయ్యాయి. వీటిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి 5,76,433 ఓట్లు (48.49 శాతం) వచ్చాయి. కాగా 2019 (గత నెలలో) జరిగిన ఎంపీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం ఓటర్లు 14,97,996 మంది ఉండగా, 10,44,504 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీఆర్‌ఎస్‌కు 4,34,244 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 సెగ్మెంట్లలో కలిపి 4,43,468 ఓట్లు 37.30 శాతం వచ్చాయి. కాగా గత నెలలో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌కు 4,28,015 ఓట్లు పడ్డాయి. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి 2018లో ఏడు సెగ్మెంట్లలో కలిపి 1,32,965 ఓట్లు ఆధిక్యం వస్తే గత నెలలో (2019)లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 6,229 ఓట్ల ఆధిక్యం మాత్రమే లభించింది.
 
సమన్వయ లోపమే శాపమా..?
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మెదక్, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాలను భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంటుంది. మెదక్‌లో సుమారుగా 5 లక్షలు, జహీరాబాద్‌లో సుమారుగా 2లక్షలకు పైగానే మెజారిటీ వస్తుందని ఎన్నికల సమయంలో కార్యకర్తల, ప్రచార సభల్లో మాజీ మంత్రి, సీనియర్‌ నేత హరీశ్‌రావుతో సహా ఉమ్మడి జిల్లా పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేశారు. కాగా ఫలితాలు వెలువడిన తరువాత మెదక్‌ కాస్త పర్వాలేదనిపించినా.. జహీరాబాద్‌లో మాత్రం కేవలం 6వేల ఓట్లకే మెజారిటీ పరిమితం కావడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. జహీరాబాద్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ 2014లో మొదటిసారిగా ఎంపీగా టీఆర్‌ఎస్‌ టికెట్‌పై విజయం సాధించారు.

 ఆయనకు పార్టీ నేతలతో, సెగ్మెంట్‌లోని ఎమ్మెల్యేలతో అంతగా సఖ్యత, సాన్నిహిత్యం లేదని ప్రచారం జరిగింది. చాలామంది నేతలు పాటిల్‌ అభ్యర్థిత్వాన్ని సైతం వ్యతిరేకిస్తూ టికెట్‌ రెండోసారి కేటాయించకముందే సీఎం కేసీఆర్‌కు చెప్పినట్లు సమాచారం. పార్లమెంటు స్థానాల వారీగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఆయా జిల్లా నేతలు, అభ్యర్థులతో ఓట్ల శాతం, మెజారిటీ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. అందువల్లనే ప్రచారం సమయంలో కూడా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అంతగా ఆసక్తి చూపలేదనే అపవాదు కూడా ఉంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు తప్ప మనస్ఫూర్తిగా బీబీ పాటిల్‌కు కొందరు ప్రచారం చేయలేదని కూడా ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది. లోక్‌సభ అభ్యర్థి పాటిల్‌ అందరినీ కలుపుకొని పోవడంలో కాస్త విఫలమయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా 6వేల ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో గెలవడంతో పార్టీ అభ్యర్థితో సహా పార్టీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement