సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 17వ తేదీన కరీంనగర్ సభలో ఆమర అమర్యాదకరంగా ‘ఈ హిందూ గాళ్లు.. బొందు గాళ్లూ.. దిక్కుమాలిన.. దరిద్రపు గాళ్లు..’ అంటూ వ్యాఖ్యలు చేశారని, అలాగే ‘దేశంలో అగ్గి పెట్టాలే.. గత్తర లేవాలే..’ అంటూ హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని విశ్వ హిందూ పరిషద్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాం రాజు చేసిన ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్‌కు నోటీసులు జారీచేసింది.
ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదును పరిశీలించి కేసీఆర్ ప్రసంగాన్ని ఆంగ్లంలో తెప్పించుకుని, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) ద్వారా వాస్తవ నివేదిక తెప్పించుకుని పరిశీలించిందని నోటీసులో పేర్కొంది. ‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చింది. మీరు చేసిన ప్రకటన.. సామరస్యానికి విఘాతం కలిగించే సామర్థ్యం కలిగి ఉంది. అలాగే ఉనికిలో ఉన్న సామాజిక, మతపర విభేదాలను పెంచేదిగా ఉంది. తద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు..’ అని నోటీసులో పేర్కొంది. ‘దీనిపై సంజాయషీ ఇచ్చేందుకు కమిషన్ మీకు ఒక అవకాశం కల్పిస్తోంది. 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా మీరు వివరణ ఇవ్వండి. ఇందులో మీరు విఫలమైతే కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ఎలాంటి నోటీసు లేకుండా చర్యలు తీసుకుంటుంది..’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment