peddpally
-
విరిగిన రైలు పట్టా
ఓదెల (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగింది. సాధారణ తనిఖీలు చేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. బుధవారం ఉదయం కొందరు రైల్వే సిబ్బంది అప్‌లైన్‌లో పట్టాలు తనిఖీ చేస్తూ.. ముందుకు వెళ్తున్నారు. వారు పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే అప్లైన్లోని పట్టా విరిగినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచనల మేరకు సిబ్బంది, సాంకేతిక నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని, విరిగిన పట్టాకు మరమ్మతులు చేశారు. శీతాకాలం కావడం.., సంకోచ, వ్యాకోచాల కారణంగా రైలు పట్టా విరిగి ఉంటుందని అధికారులు వివరించారు. దీని కారణంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వైపు వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్, గూడ్సు, ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. -
కారెక్కనున్న ఆరెపల్లి?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి టికెట్ ఆశించిన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆరెపల్లి మోహన్ తిరుగుబావుటా ఎగరేశారు. ఆయన కాంగ్రెస్‌ను వీడి, అధికార టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాకుచెందిన మంత్రులతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిసింది. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కూడా భేటీ అయి.. భేషరతుగా టీఆర్ఎస్లో చేరి మద్దతిచ్చేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశంలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. టీఆర్ఎస్లో చేరే విషయాన్ని ప్రకటించాలని భావించారు. ఈ మేరకు మీడియాను కూడా ఆహ్వానించారు. అయితే ఈ విషయం తెలిసి కాంగ్రెస్ నాయకులు ఆరెపల్లి మోహన్ నివాసానికి రావడంతో సమావేశాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం కరీంనగర్లో జరిగే కేసీఆర్ బహిరంగసభలోనే పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే వ్యూహాత్మకంగా పెద్దపల్లి సభలో పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎవరీ చంద్రశేఖర్..? అభ్యర్థులే కరువయ్యారా? పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పలువురు నాయకులు టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గణనీయంగా ఓట్లు పోలు కావడం.. పార్లమెంట్ పరిధిలోని మంథని, రామగుండంలో టీఆర్ఎస్ సిట్టింగులు ఓడిపోవడంతో రాష్ట్రంలోని పలువురు నాయకులు ఈ సీటుపై కన్నేశారు. 32 మంది నాయకులు ఈ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో గతంలో రాష్ట్రంలో కీలకమైన పదవులు నిర్వహించిన వారూ ఉన్నారు. ఎస్సీల్లోని సామాజిక సమీకరణాల నేపథ్యంలో పెద్దపల్లి సీటును మాదిగకు కేటాయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో మాదిగ వర్గానికి చెందిన ఆరెపల్లి మోహన్, కవ్వంపల్లి సత్యనారాయణ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే పీసీసీ నేతలతో ఉన్న సంబంధాలతో వికారాబాద్‌కు చెందిన మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ ఢిల్లీ స్థాయిలో పైరవీ నడిపి టికెట్ తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రశేఖర్ ఎవరో పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో సీనియర్ రాజకీయ నాయకులకు తప్ప ఇప్పుడెవరికీ తెలియదు. ప్రజలతోగానీ.. ఈ ప్రాంతంతోగానీ సంబంధాలే లేవు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ తొలి జాబితాలో చంద్రశేఖర్ పేరు చోటుచేసుకోవడం కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేసిన తనను కాదని రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకుడికి సీటివ్వడాన్ని ఆరెపల్లి మోహన్ జీర్ణించుకోలేకపోయారు. పార్టీని వదలాలని నిర్ణయించుకున్నారు. ఫలించని జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు రాయభారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఆదివారం పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న టి.జీవన్‌రెడ్డికి మద్దతుగా ఏర్పాటుచేసిన సమావేశానికి మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం తది తరులు హాజరయ్యారు. సమావేశానికి ఆరెపల్లి మోహ న్ కూడా వస్తారని భావించినా ఆయన రాలేదు. సమావేశం జరుగుతున్న సమయంలోనే సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు విలేకరులకు సమాచారం వచ్చింది. విషయం తెలుసుకున్న జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు హుటాహుటిన ఆరెపల్లి మోహ న్ ఇంటికి వెళ్లారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కతో ఫోన్లో మాట్లాడించారు. ‘ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. నీకు ఏం చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది’ అని సముదాయించారు. అవేమీ పట్టించుకోని మోహన్ విలేకరుల సమావేశాన్ని రద్దు చేసినట్లు చెబుతూ హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం రాత్రి ఎ.చంద్రశేఖర్‌కు సీటు ఖరారైన తరువాత టీఆర్ఎస్ నేతలు మోహన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీ వినోద్, ఓ మంత్రితో సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆదివారం నాటి కేసీఆర్ సభలో మోహన్ పార్టీలో చేరబోరని, విడిగా ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ కండువా కప్పుకుంటారని జిల్లాకు చెంది న ఓ టీఆర్ఎస్ ప్రముఖుడు తెలిపారు. మోహన్ బాట లోనే పెద్దపల్లి లోక్‌సభకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని సమాచారం. -
ఢిల్లీకి బీజేపీ చిట్టా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం.. కరీంనగర్ జిల్లాలోని రెండుస్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల పేర్లను కేంద్ర నాయకత్వానికి పంపించింది. కరీంనగర్, పెద్దపల్లి (ఎస్సీ) పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. కేవలం కరీంనగర్ అసెంబ్లీ స్థానంలోనే బీజేపీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్.. సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 14వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన సంజయ్ నియోజకవర్గం నుంచి 66వేల ఓట్లు సాధించారు. ఆయన మినహా కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులెవరూ డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, పుల్వామా దాడుల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపికి ఓట్లు రాలుస్తాయని ఆ పార్టీ నాయకులతోపాటు దిగువ శ్రేణి యంత్రాంగం కూడా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి స్థానాల నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నేతలతోపాటు అవకాశం కోసం ఎదురుచూస్తున్న నాయకులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ రాష్ట్ర నాయకత్వం కోర్‌కమిటీ, రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి టికెట్లు ఆశిస్తున్న ముగ్గురేసి నేతల పేర్లను ఢిల్లీకి పంపించింది. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలోని ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించనుంది. కరీంనగర్లో బండి సంజయ్‌కు శ్రేణుల అండ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు ముచ్చెమటలు పోయించారు. ఒక దశలో గెలుపు ఇద్దరి మధ్య దోబూచులాడినంత పనిచేసింది. హిందుత్వ నినాదంతో కరీంనగర్ నగరంలో తనకంటూ ప్రత్యేక ఇమేజీ సంపాదించుకున్న సంజయ్‌కు వ్యతిరేకంగా ఒకవర్గం ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్కు పోలవడంతో ఓటమి పాలయినట్లు ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్కన్నా సంజయ్‌కే అత్యధిక ఓట్లు పోలవడంతో పార్టీ దిగువ శ్రేణుల్లో ఆయనకు ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నుంచి సంజయ్ పోటీ చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన నాయకులు కూడా భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత చొప్పదండి, సిరిసిల్ల, హుజూరాబాద్ తదితర నియోజకవర్గాల నుంచి పోటీచేసిన అభ్యర్థులంతా ముఖం చాటేయడంతో పార్టీకి నాయకులు లేకుండాపోయారు. సంజయ్‌కు ఆదరణ పెరగడం పార్టీలోని ‘పెద్ద’ నాయకులకు నచ్చడం లేదనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో కరీంనగర్ నుంచి సంజయ్‌కు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పెద్దల సాయంతో ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీకి సంజయ్, గుజ్జుల, ప్రదీప్‌కుమార్ పేర్లు పార్టీ రాష్ట్ర కమిటీ బుధవారం ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్న ముగ్గురేసి నాయకుల పేర్లను కేంద్ర పార్టీకి పంపించింది. కరీంనగర్లో సంజయ్‌తోపాటు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి, అదే నియోజకవర్గానికి చెందిన ప్రదీప్‌రావును ఆశావహులుగా పేర్కొంటూ కేంద్ర పార్టీకి సిఫారసు చేశారు. గుజ్జుల, ప్రదీప్‌రావు ఇద్దరూ పెద్దపల్లి అసెంబ్లీకి చెందిన వారే కావడం గమనార్హం. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లిలో పోటీ చేసిన గుజ్జుల రామకృష్ణారెడ్డి కేవలం 9,375 ఓట్లు సాధించారు. ప్రదీప్‌రావుకు ఢిల్లీస్థాయిలో పెద్దల ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్ మాత్రం తనకు టికెట్ ఖాయమనే ధీమాతో ఉన్నారు. పెద్దపల్లి నుంచి సైతం ముగ్గురి పేర్లు... పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కూడా ముగ్గురు నాయకుల బయోడేటాలను పార్టీ రాష్ట్ర కమిటీ ఢిల్లీకి పంపించింది. మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్యతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, బెల్లంపల్లి నుంచి గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కొయ్యల ఏమాజీ పేర్లను జాతీయ నాయకత్వ పరిశీలనకు పంపించారు. ఈ నియోజకవర్గంలో ఎస్.కుమార్ వైపే పార్టీ మొగ్గు చూపనున్నట్లు సమాచారం. సింగరేణి కార్మికుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గోదావరి ఖనికి చెందిన కుమార్ వల్ల ఓట్ల శాతం పెరుగుతుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణల్లో భాగంగా పెద్దపల్లి నుంచి మాల వర్గానికి సీటు కేటాయించాలని భావిస్తే తనకు అవకాశం లభిస్తుందని బెల్లంపల్లికి చెందిన కొయ్యల ఏమాజీ భావిస్తున్నారు. నేడోరేపో ప్రకటన... పార్లమెంట్ ఎన్నికలకు ఈనెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించనుండడంతో బీజేపీ అభ్యర్థుల జాబితాను ఒకటి రెండురోజుల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు కేటాయిస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. లేదంటే ఢిల్లీ నాయకత్వం వద్ద పలుకుబడి ఉన్న నాయకులు ఎవరి పేరు సూచిస్తే వారికి అవకాశం లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గొంతుకోసుకుని యువకుడి ఆత్మహత్య
పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామానికి చెందిన మేకల పోల్‌రాజ్(28) మద్యం మత్తులో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... చీకురాయికి చెందిన పోల్‌రాజ్ సైకిల్ రిపేరింగు, చిన్న దుకాణం నడుపుతు జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా సైకోగా వ్యవహరిస్తున్నాడు. మద్యానికి కూడా బానిసయ్యాడు. సోమవారం రాత్రి మద్యం సేవించిన తర్వాత కత్తితో గొంతు కోసుకుని రక్తం కారుతుండగా తల్లిదండ్రులవద్దకు వచ్చాడు. వారు పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత కరీంనగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ్నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. పోల్‌రాజ్ తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొత్త జిల్లా... పాత డివిజన్ కంటే తక్కువే..
పెద్దపల్లి జిల్లాపై నాయకుల పెదవి విరుపు పెద్దపల్లి : జిల్లాల పునర్విభజన పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రానికి ఎసరు తెచ్చింది. కొత్త మండలాలను చేర్చి జిల్లాగా మార్చితే విస్తృతంగా కనిపించేది. అయితే, పెద్దపల్లిలోని మండలాలను పక్క జిల్లాలో చేర్చడంతో చిన్నగా అవతరించింది. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ నుంచి 1996లో మంథని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాగా ఆవిర్భవించబతోంది. అయితే, అనేక ఏళ్లుగా పరిపాలన, స్నేహ, బంధుత్వాలు కలిగిన పెద్దపల్లి, మంథని ప్రాంతాలు వేరుపడబోతున్నాయి. నిన్నటి వరకు మంథని నియోజకవర్గంలోని కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం, మల్హర్ మండలాలను జయశంకర్(భూపాలపల్లి) జిల్లాలో చేర్చడంతో పాత వరంగల్ జిల్లాకు భౌగోళికంగా దగ్గరవుతోందని నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి డివిజన్‌తో అనేక ఏళ్లుగా సంబంధం కలిగిన వెల్గటూరు మండల ప్రజలు ప్రతీచిన్న పనికి పెద్దపల్లికే వస్తుంటారు. పోలీస్ సర్కిల్ కార్యాలయం, కోర్టు, ఇతర వ్యవహారాలన్నీ పెద్దపల్లి, సుల్తానాబాద్తోనే ముడిపడిఉన్నాయి. సమితుల పరిపాలన సమయంలో వెల్గటూరు, ధర్మారం, సుల్తానాబాద్ సమితి కింద పనిచేసేవి. ఆ వ్యవస్థ రద్దు కావడం, మండలాలు ఏర్పాటు కావడంతో ధర్మారం, వెల్గటూరు మండల పరిషత్తులుగా రూపుదిద్దుకున్నాయి. అయినా పోలీసులు, న్యాయస్థానం అంతా పెద్దపల్లి చుట్టూ ఉండేవి. ఇప్పటికీ పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలోనే తమ పనులు చేయించుకునే వెల్గటూరు మండల ప్రజలు.. వెల్గటూరును జగిత్యాల జిల్లాలో చేర్చడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. కాల్వశ్రీరాంపూర్ కలవరం... కాల్వశ్రీరాంపూర్ మండలాన్ని మంథని రెవెన్యూ డివిజన్లో చేర్చడాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సుల్తానాబాద్‌కు సమీపంలో ఉన్నప్పుడే పెద్దపల్లి సమితిలో కొనసాగిన కాల్వశ్రీరాంపూర్ గ్రామాలు.. ఇప్పుడు మంథని రెవెన్యూ డివిజన్లో చేర్చడం సరికాదంటున్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందినవారే. జిన్నం మల్లారెడ్డి మూడుసార్లు, గీట్ల ముకుందరెడ్డి మూడుసార్లు, కాల్వ రాంచంద్రారెడ్డి ఒకసారి పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి రాజకీయ ప్రాధాన్యత కలిగిన శ్రీరాంపూర్ మండలం 50 కిలోమీటర్ల దూరంలోని మంథనికి చేర్చడం అన్యాయమని ఆ మండలవాసులు అంటున్నారు. దీనిపై బంధులు, రాస్తారోకోలులాంటి ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామంటున్నారు.