కొత్త జిల్లా... పాత డివిజన్‌ కంటే తక్కువే.. | peddapally new distirct | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లా... పాత డివిజన్‌ కంటే తక్కువే..

Published Sun, Aug 28 2016 10:02 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

peddapally new distirct

  • పెద్దపల్లి జిల్లాపై నాయకుల పెదవి విరుపు
  •  పెద్దపల్లి : జిల్లాల పునర్విభజన పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌ కేంద్రానికి ఎసరు తెచ్చింది. కొత్త మండలాలను చేర్చి జిల్లాగా మార్చితే విస్త­ృతంగా కనిపించేది. అయితే, పెద్దపల్లిలోని మండలాలను పక్క జిల్లాలో చేర్చడంతో చిన్నగా అవతరించింది. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌ నుంచి 1996లో మంథని రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాగా ఆవిర్భవించబతోంది. అయితే, అనేక ఏళ్లుగా పరిపాలన, స్నేహ, బంధుత్వాలు కలిగిన పెద్దపల్లి, మంథని ప్రాంతాలు వేరుపడబోతున్నాయి. నిన్నటి వరకు మంథని నియోజకవర్గంలోని కాటారం, మహదేవ్‌పూర్, మహాముత్తారం, మల్హర్‌ మండలాలను జయశంకర్‌(భూపాలపల్లి) జిల్లాలో చేర్చడంతో పాత వరంగల్‌ జిల్లాకు భౌగోళికంగా దగ్గరవుతోందని నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి డివిజన్‌తో అనేక ఏళ్లుగా సంబంధం కలిగిన వెల్గటూరు మండల ప్రజలు ప్రతీచిన్న పనికి పెద్దపల్లికే వస్తుంటారు. పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం, కోర్టు, ఇతర వ్యవహారాలన్నీ పెద్దపల్లి, సుల్తానాబాద్‌తోనే ముడిపడిఉన్నాయి. సమితుల పరిపాలన సమయంలో వెల్గటూరు, ధర్మారం, సుల్తానాబాద్‌ సమితి కింద పనిచేసేవి. ఆ వ్యవస్థ రద్దు కావడం, మండలాలు ఏర్పాటు కావడంతో ధర్మారం, వెల్గటూరు మండల పరిషత్తులుగా రూపుదిద్దుకున్నాయి. అయినా పోలీసులు, న్యాయస్థానం అంతా పెద్దపల్లి చుట్టూ ఉండేవి. ఇప్పటికీ పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలోనే తమ పనులు చేయించుకునే వెల్గటూరు మండల ప్రజలు.. వెల్గటూరును జగిత్యాల జిల్లాలో చేర్చడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. 
     
    కాల్వశ్రీరాంపూర్‌ కలవరం...
    కాల్వశ్రీరాంపూర్‌ మండలాన్ని మంథని రెవెన్యూ డివిజన్‌లో చేర్చడాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సుల్తానాబాద్‌కు సమీపంలో ఉన్నప్పుడే పెద్దపల్లి సమితిలో కొనసాగిన కాల్వశ్రీరాంపూర్‌ గ్రామాలు.. ఇప్పుడు మంథని రెవెన్యూ డివిజన్‌లో చేర్చడం సరికాదంటున్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాల్వశ్రీరాంపూర్‌ మండలానికి చెందినవారే. జిన్నం మల్లారెడ్డి మూడుసార్లు, గీట్ల ముకుందరెడ్డి మూడుసార్లు, కాల్వ రాంచంద్రారెడ్డి ఒకసారి పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి రాజకీయ ప్రాధాన్యత కలిగిన శ్రీరాంపూర్‌ మండలం 50 కిలోమీటర్ల దూరంలోని మంథనికి చేర్చడం అన్యాయమని ఆ మండలవాసులు అంటున్నారు. దీనిపై బంధులు, రాస్తారోకోలులాంటి ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామంటున్నారు.
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement