
సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
ఓదెల (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగింది. సాధారణ తనిఖీలు చేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. బుధవారం ఉదయం కొందరు రైల్వే సిబ్బంది అప్‌లైన్‌లో పట్టాలు తనిఖీ చేస్తూ.. ముందుకు వెళ్తున్నారు.
వారు పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే అప్‌లైన్‌లోని పట్టా విరిగినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచనల మేరకు సిబ్బంది, సాంకేతిక నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని, విరిగిన పట్టాకు మరమ్మతులు చేశారు.
శీతాకాలం కావడం.., సంకోచ, వ్యాకోచాల కారణంగా రైలు పట్టా విరిగి ఉంటుందని అధికారులు వివరించారు. దీని కారణంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వైపు వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్, గూడ్సు, ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment