సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం.. కరీంనగర్ జిల్లాలోని రెండుస్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల పేర్లను కేంద్ర నాయకత్వానికి పంపించింది. కరీంనగర్, పెద్దపల్లి (ఎస్సీ) పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. కేవలం కరీంనగర్ అసెంబ్లీ స్థానంలోనే బీజేపీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్.. సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 14వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన సంజయ్ నియోజకవర్గం నుంచి 66వేల ఓట్లు సాధించారు. ఆయన మినహా కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులెవరూ డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు.
ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, పుల్వామా దాడుల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపికి ఓట్లు రాలుస్తాయని ఆ పార్టీ నాయకులతోపాటు దిగువ శ్రేణి యంత్రాంగం కూడా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి స్థానాల నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నేతలతోపాటు అవకాశం కోసం ఎదురుచూస్తున్న నాయకులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ రాష్ట్ర నాయకత్వం కోర్‌కమిటీ, రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి టికెట్లు ఆశిస్తున్న ముగ్గురేసి నేతల పేర్లను ఢిల్లీకి పంపించింది. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలోని ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించనుంది.
కరీంనగర్‌లో బండి సంజయ్‌కు శ్రేణుల అండ
అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు ముచ్చెమటలు పోయించారు. ఒక దశలో గెలుపు ఇద్దరి మధ్య దోబూచులాడినంత పనిచేసింది. హిందుత్వ నినాదంతో కరీంనగర్ నగరంలో తనకంటూ ప్రత్యేక ఇమేజీ సంపాదించుకున్న సంజయ్‌కు వ్యతిరేకంగా ఒకవర్గం ఓట్లు గంపగుత్తగా టీఆర్‌ఎస్‌కు పోలవడంతో ఓటమి పాలయినట్లు ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కన్నా సంజయ్‌కే అత్యధిక ఓట్లు పోలవడంతో పార్టీ దిగువ శ్రేణుల్లో ఆయనకు ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నుంచి సంజయ్ పోటీ చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన నాయకులు కూడా భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత చొప్పదండి, సిరిసిల్ల, హుజూరాబాద్ తదితర నియోజకవర్గాల నుంచి పోటీచేసిన అభ్యర్థులంతా ముఖం చాటేయడంతో పార్టీకి నాయకులు లేకుండాపోయారు. సంజయ్‌కు ఆదరణ పెరగడం పార్టీలోని ‘పెద్ద’ నాయకులకు నచ్చడం లేదనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో కరీంనగర్ నుంచి సంజయ్‌కు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పెద్దల సాయంతో ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.
కేంద్ర కమిటీకి సంజయ్, గుజ్జుల, ప్రదీప్‌కుమార్ పేర్లు
పార్టీ రాష్ట్ర కమిటీ బుధవారం ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్న ముగ్గురేసి నాయకుల పేర్లను కేంద్ర పార్టీకి పంపించింది. కరీంనగర్‌లో సంజయ్‌తోపాటు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి, అదే నియోజకవర్గానికి చెందిన ప్రదీప్‌రావును ఆశావహులుగా పేర్కొంటూ కేంద్ర పార్టీకి సిఫారసు చేశారు. గుజ్జుల, ప్రదీప్‌రావు ఇద్దరూ పెద్దపల్లి అసెంబ్లీకి చెందిన వారే కావడం గమనార్హం. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లిలో పోటీ చేసిన గుజ్జుల రామకృష్ణారెడ్డి కేవలం 9,375 ఓట్లు సాధించారు. ప్రదీప్‌రావుకు ఢిల్లీస్థాయిలో పెద్దల ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్ మాత్రం తనకు టికెట్ ఖాయమనే ధీమాతో ఉన్నారు.
పెద్దపల్లి నుంచి సైతం ముగ్గురి పేర్లు...
పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి కూడా ముగ్గురు నాయకుల బయోడేటాలను పార్టీ రాష్ట్ర కమిటీ ఢిల్లీకి పంపించింది. మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్యతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, బెల్లంపల్లి నుంచి గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కొయ్యల ఏమాజీ పేర్లను జాతీయ నాయకత్వ పరిశీలనకు పంపించారు. ఈ నియోజకవర్గంలో ఎస్.కుమార్ వైపే పార్టీ మొగ్గు చూపనున్నట్లు సమాచారం. సింగరేణి కార్మికుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గోదావరి ఖనికి చెందిన కుమార్ వల్ల ఓట్ల శాతం పెరుగుతుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణల్లో భాగంగా పెద్దపల్లి నుంచి మాల వర్గానికి సీటు కేటాయించాలని భావిస్తే తనకు అవకాశం లభిస్తుందని బెల్లంపల్లికి చెందిన కొయ్యల ఏమాజీ భావిస్తున్నారు.
నేడోరేపో ప్రకటన...
పార్లమెంట్ ఎన్నికలకు ఈనెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించనుండడంతో బీజేపీ అభ్యర్థుల జాబితాను ఒకటి రెండురోజుల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు కేటాయిస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. లేదంటే ఢిల్లీ నాయకత్వం వద్ద పలుకుబడి ఉన్న నాయకులు ఎవరి పేరు సూచిస్తే వారికి అవకాశం లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment