నన్ను ఓడించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుట్రలు
కరీంనగర్ అభివృద్ధికి రూ.12వేల కోట్లు తెచ్చా
బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్
కరీంనగర్: ‘నేను పక్కా లోకల్.. రూ.12 వేల కోట్ల నిధులతో కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశా’నని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. హుస్నాబాద్‌లో సోమవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ముందుగా గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి స్వాగతం పలికారు. సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు దొరకక, బయటి ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారన్నారు.
గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదని, అందుకే మాజీ సర్పంచ్‌లు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అభివృద్ధికి కేంద్రమే నిధులు ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కరెంట్ బిల్లులను కట్టిందన్నారు. పల్లెల అభివృద్ధికి పాటుపడిన సర్పంచ్‌లను నిలువునా మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు.
కరీంనగర్ ఎంపీగా నన్ను ఓడించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ‘హుస్నాబాద్ ఎమ్మెల్యే నన్ను వెధవ అంటున్నారు. ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఆయన నన్ను ఎంత తిట్టినా పడతా’నని బండి అన్నారు. హామీలపై మొదట శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్ నాయక్, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే..!
Comments
Please login to add a commentAdd a comment