కామారెడ్డి: జిల్లాలో నాలుగు నియోజకవర్గాలున్నాయి. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్ కాగా.. కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌గా, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ప్యానెల్ స్పీకర్‌గా వ్యవహరించారు. స్పీకర్ స్థానంలో ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో జరిగిన శాసనసభ సమావేశాలకు అధ్యక్షత వహించారు.
ప్రొటెం స్పీకర్‌గా హన్మంత్ సింధేకు అప్పుడప్పుడు అవకాశం వచ్చింది. ప్రభుత్వ విప్ హోదాలో గంప గోవర్ధన్ తన పాత్ర ను నిర్వర్తించారు. అవకాశం చిక్కినపుడల్లా ఆయన కామారెడ్డి నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కూడా ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌లలో తన నియోజక వర్గంలోని సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నించారు.
జనం మదిని గెలిచేందుకు..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలాకాలంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో జనంలో తిరుగుతున్నారు. అయితే ఆఖరి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఇక అందరూ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి సమయం కేటాయించనున్నారు.
షెడ్యూల్ వెలువడితే ఎన్నికల కోడ్ వస్తుందని, ఆలోపు అన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడం, పూర్తయిన వాటిని ప్రారంభించడం వంటివాటిపై దృష్టి పెట్టనున్నారు. అటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
గ్రామాలు, మండలాలవారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని, కార్యక్రమాలు చేపట్టనున్నారు. పార్టీ శ్రేణులకు దగ్గరవుతూ, ఇతర పార్టీల్లోని నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వలసలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లోనూ తామే బరిలో నిలుస్తామన్న నమ్మకంతో ఉన్న ఎమ్మెల్యేలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
మరోసారి అవకాశం దక్కేనా?
శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆదివారం ముగిశాయి. ప్రస్తుత శాసనసభ కాలం మరో నాలుగు నెలల్లో ముగిసిపోనుంది. త్వరలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ దఫాలో ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యేలంతా ఇక జనంలోనే ఉండనున్నారు. ప్రజల మద్దతు కోసం ప్రయత్నించనున్నారు.
జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా అధికార పార్టీకి చెందినవారే.. ఆయా స్థానాల్లో వారే పోటీ చేస్తారని భావిస్తున్నారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డే తిరిగి పోటీ చేస్తారని అప్పట్లో తెలంగాణ తిరుమల ఆలయ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో పోచారం తిరిగి పోటీ చేస్తారన్న విషయం స్పష్టమైంది.
ఇటీవల జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ అక్కడి ఎమ్మెల్యే సింధేను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడంతో ఆయనకు సైతం మరోసారి అవకాశం దక్కడం ఖాయమని తెలుస్తోంది. ఎల్లారెడ్డిలో మంత్రి హరీష్‌రావు పర్యటన సందర్భంగా సురేందర్ కష్టపడే వ్యక్తి అని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తిరిగి సురేందర్‌నే బరిలో నిలపవచ్చని భావిస్తున్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వరుస విజయాలు సాధించారు. నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. సీఎం పోటీ చేయకపోతే గంప గోవర్ధనే తిరిగి బరిలో నిలిచే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment