బండ పగలకొడతాం.. సాగునీరు పారిస్తాం! : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

బండ పగలకొడతాం.. సాగునీరు పారిస్తాం! : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Published Thu, Mar 14 2024 1:00 AM | Last Updated on Thu, Mar 14 2024 12:38 PM

- - Sakshi

జూరాల నుంచి కొడంగల్‌కుకృష్ణా జలాలు తరలించే కార్యక్రమం సీఎం చేపట్టారు

వాకిటి శ్రీహరిని గెలిపించినందుకే ఇక్కడికి వచ్చాం

పాలమూరు ఎంపీగా వంశీని గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి

మక్తల్‌ ప్రజాదీవెన సభలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: ‘బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో సంగంబండ రిజర్వాయర్‌ కింద ఉన్న బండను పగలకొట్టకుండా 15 గ్రామాలకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించింది.. నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లింపులోనూ మొండిచేయి చూపారు.. బండ పగలకొట్టింటే 25 వేల ఎకరాలకు సాగునీరు అందేది.. పైన రిజర్వాయర్‌ కింద కాల్వలు పూర్తయినా ఒక బండ పగలగొట్ట లేని చరిత్ర ఆ ప్రభుత్వానిది.. వారి నిర్లక్ష్యం వల్ల నీళ్లు లేక పదేళ్ల పాటు ఈ ప్రాంత రైతులు పంటలను ఎండబెట్టుకోవాల్సి వచ్చింది..

దీంతో 15 గ్రామాల్లో రైతుల పొలాలు ఎండిపోయాయి. సభాముఖంగా హామీ ఇస్తున్నా.. ఈ ప్రాంత రైతుల 19 ఏళ్ల కల నెరవేరబోతుంది.. ఆ బండ పగలగొట్టి సాగునీరు పారిస్తామ’ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం వారు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సంగంబండ లో లెవల్‌ కెనాల్‌ కింద ఉన్న సంగంబండను పరిశీలించి ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు.

 సందర్భంగా వారు మాట్లాడుతూ భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్‌ లెఫ్ట్‌ లో లెవల్‌ కెనాల్‌ కోసం 500 మీటర్ల బండ తొలగి సంగబండ గ్రామానికి చెందిన ముంపు బాధితులకు చెల్లించాల్సిన కూలీ డబ్బులు పదేళ్లుగా నిలిచిపోయాయని, దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు నెలల్లో రూ.12 కోట్లు ప్రభుత్వం ముంపు బాధితుల ఖాతాలో జమ చేసిందన్నారు. ఉజ్జెల్లికి రూ.13.34 కోట్లు, కొత్తగార్లపల్లికి రూ.1.19 కోట్లు జమ చేసేందుకు చొరవ తీసుకుంటామన్నారు.

నేరడ్‌గం, ఆర్‌ఆర్‌ సెంటర్లు అనుగొండ, గడ్డంపల్లి గ్రామాలకు సైతం అందాల్సిన బెనిఫిట్స్‌ అందిస్తామన్నారు. పాలమూరు నుంచి వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఈ ప్రాంతంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది.. పాలమూరు సమస్యలు తెలిసినందుకే జూరాల నుంచి కొడంగల్‌– నారాయణపేట ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీళ్లు మళ్లించే పథకానికి రూ.3 వేల కోట్లు వెచ్చించారని చెప్పారు. మక్తల్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరపున నిలబడిన ముదిరాజ్‌ వాకిటి శ్రీహరిని గెలిపించినందుకే ఇక్కడికి వచ్చామని మంత్రులు పేర్కొన్నారు.

లక్ష మెజార్టీతో గెలిపించండి!
రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని ప్రకటించిందని, వంశీని లక్ష మెజార్టీతో గెలిపిస్తే.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. వంశీచంద్‌రెడ్డి గెలవక ముందే రూ.వందల కోట్ల నిధులు పాలమూరుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

గెలిచాక తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎంపీ చేయని విధంగా వంశీ పనిచేస్తాడనే నమ్మకం ఉందన్నారు. విద్యార్థి విభాగం నుంచి యువజన రాష్ట్ర కాంగ్రెస్‌, జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన వంశీచంద్‌రెడ్డి సోనియా, రాహుల్‌గాంధీలతో అత్యంత సన్నిహితంగా ఉంటారన్నారు. వంశీచంద్‌రెడ్డికి మక్తల్‌ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు.

రూ.350 కోట్లు మంజూరు చేయండి: వాకిటి శ్రీహరి
మక్తల్‌ నియోజకవర్గంలో ఏడు లిఫ్టు ఇరిగేషన్లు పునరుద్ధరించేందుకు రూ.350 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులను కోరారు. ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌లో అభివృద్ధికి సహకరించాలన్నారు. నారాయణపేట– కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పేరులో తమ ప్రాంతం పేరు పెట్టాలని కోరడంతో మక్తల్‌– నారాయణపేట– కొడంగల్‌ ఎత్తిపోతల పథకం మార్చారన్నారు.

అలాగే మక్తల్‌లో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌, సంగంబండ దగ్గర సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు, ఊట్కూర్‌ మండలం పూలిమామిడిలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, దేవరకద్రలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, నాయకులు బాలకృష్ణరెడ్డి, గోపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, హన్మంతు, సురేశ్‌కుమార్‌, రవికుమార్‌, గణేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: వీడిన సస్పెన్స్‌..! లోక్‌సభ అభ్యర్థిగా డీకే అరుణ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement