‘స్థానిక’ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
సీఎం రేవంత్ నుంచి బీఫాం అందుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మన్నె
నేడు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయనున్న జీవన్‌రెడ్డి
బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి సైతం..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరు ఇక హోరెత్తనుంది. సోమవారంతో నామినేషన్లకు తుది గడువు ముగియనుండగా.. ఇదేరోజు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు మన్నె జీవన్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఎవరికి వారు భారీ ఏర్పాట్లకు సన్నాహాలు మొదలుపెట్టారు. పోటాపోటీగా ఊరేగింపు, భారీ ర్యాలీల మధ్య ఇరువురు వేర్వేరు సమయాల్లో మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
కాంగ్రెస్: ఉదయం 11 గంటలకు..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా బీఫాం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జీవన్‌రెడ్డి చిన్నాన్న, ఎంఎస్‌ఎన్ ఫార్మా పరిశ్రమల అధినేత మన్నె సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సహకారంతో ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కాగా, జీవన్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి సైతం..
బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి శనివారం ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేతులమీదుగా బీఫాం అందుకున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. స్థానిక జేజేఆర్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు పాల్గొననున్న సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.
28న పోలింగ్.. 2న లెక్కింపు
బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో చేరి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన రాజీనామాతో ఎమ్మెల్సీ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం సోమవారం నామినేషన్లకు తుదిగడువు కాగా.. ఎన్నికల అధికారులు 12న స్క్రూట్నీ చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 14 కాగా.. 28న ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. వచ్చే నెల రెండో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇవి చదవండి: కసితో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం : కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment