హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ పాలనలో మరోసారి మోసపోయామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని, ఈ ప్రభుత్వం ప్రజల్ని దండుకోవడం తప్ప పరిపాలన చేయడం లేదని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
.. రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలి(రాజకీయ పార్టీలు, నేతలు... ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని గతంలో రేవంత్ చెప్పిన మాటల వీడియోను ఈటల ప్రదర్శించారు). ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. మాట తప్పిన వాళ్ళను కాలం ఖచ్చితంగా బొంద పెడుతుంది. విశ్వసనీయత లేని పార్టీలను, మోసం చేసినవాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు అని అన్నారాయన.
తెలంగాణ ప్రజలు.. మరోసారి మోసపోయామని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడ లో కూసొని పేదల గురించి ఆలోచించడం లేదు. రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్లు. మూడున్నర ఎకరాల తడి పొలం ఉన్నవారికి రేషన్ కార్డు ఇవ్వరు. ఏడు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారికి రేషన్ కార్డు ఉండదు. పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయంతో.. 69 లక్షల మంది రైతులకు నిరాశ ఎదురవుతుంది.
రుణ మాఫీ చేస్తానని రేవంత్ అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు. రూ. 34 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్... ఇప్పుడు నిబంధనల పేరిట రైతులకు సున్నం పెడుతున్నారు. ఇదేకాకుండా.. వరి ధాన్యంకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పి రేవంత్ మోసం చేశారు. రైతులను మోసం చేసిన రాజ్యం బాగుపడదు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో చిత్తుకాగితంతో సమానం. రైతుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తప్పవు. అప్పుల పేరిట.. శ్వేత పత్రాల పేరుతో తెలంగాణ ప్రజల కడుపు కొడుతున్నారు. 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న దొమ్మరోళ్ళ, బిచ్చగాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారు’’ అని ఈటల అన్నారు.
ఇక.. తాజా ప్రొటోకాల్ వివాదంపైనా ఈటల స్పందించారు. కూకట్‌పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమానికి ఈటలకు ఆహ్వానం అందలేదు. దీనిపై ఇంతకు ముందే ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు. అయితే తాజాగా ఈ వివాదంపై మాట్లాడుతూ.. ‘‘ రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు. కానీ, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధుల్ని ఆహ్వానించాలి. కానీ, అధికారులు అలా చేయలేదు. ప్రభుత్వం పిలవలేదు. రేవంత్ తీరును ప్రజలు రికార్డు చేసుకుంటున్నారు’’ అని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment