రాజీనామాకే మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత
అధిష్టానం బుజ్జగింపులకు లొంగని వైనం
హైదరాబాద్‌కు భారీగా తరలిన అనుచరులు
నేటి ఎమ్మెల్సీ ప్రకటనపై ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాల జిల్లాలో రగిలిన రాజకీయ చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తనను సంప్రదించకుండా చిరకాల ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నరంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాజీనామాకు సిద్ధపడిన విషయం విధితమే. మంగళవారం అధిష్టాన పెద్దలను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లినా ఆయన తీరులో ఏమాత్రం మార్పు లేదు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్ సింగ్ జీవన్‌రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. ఫలితం కనిపించలేదు. కార్యకర్తలతో మాట్లాడాక బుధవారం నిర్ణయం తీసుకుంటారని, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భవి ష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన అనుచరులు ‘సాక్షి’కి తెలిపారు. జీవన్‌రెడ్డి ప్రకటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
వెనక్కి తగ్గొద్దని ఒత్తిడి..
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లారని తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అక్కడి ఆయన నివాసానికి తరలివెళ్లారు. నాయకుడు ప్రేమ్‌సాగర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులంతా జీవన్‌రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేరికపై సరైన వివరణ ఇచ్చేదాకా వెనక్కి తగ్గొద్దని ఎమ్మెల్సీపై ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో తన పదవికి రాజీనామా చేసే విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా ఆయన ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
నాయకులు, కార్యకర్తల ఆవేదన..
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికే ఆ పార్టీ నాయకులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు సంజయ్‌కుమార్ బీఆర్‌ఎస్‌ను వీడటంపై ఆ పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. పదేళ్లపాటు అధికారంలో లేనప్పటికీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జీవన్‌రెడ్డి వెంటే ఉండి, పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు పోరాటం చేసిన వ్యక్తితో కలిసి పని చేయలేమని బహిరంగంగానే చెబుతున్నారు.
ఎక్కడ చూసినా ఇదే చర్చ..
జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం నుంచి హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, కూడళ్ల వద్ద ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. జీవన్‌రెడ్డి పయనమెటు? రాజీనామా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? సంజయ్ చేరికతో ఎలాంటి మార్పులు జరుగుతాయన్న అంశాలపై చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment