కేటీఆర్
బీఆర్‌ఎస్ నుంచి కొనసాగుతున్న జంపింగ్స్
పార్లమెంట్ సెగ్మెంట్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం
సాక్షి, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంపింగ్స్ కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు ముఖ్యనేతలు కారు మార్చగా, ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకుల వంతు వచ్చింది. ఈ పరిస్థితుల్లో వలసలు ఆగేదెలా అనే తర్జనభర్జన పార్టీలో సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరగనుంది.
ఇదీ పరిస్థితి..
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ క్రమంగా ఢీలా పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వా త ఈ పార్టీ నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ముఖ్యనేతలు మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్‌రెడ్డి ఇది వరకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఐకేరెడ్డి కూడా చేరుతారనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
త్వరలోనే వారు హస్తం గూటికి చేరనున్నారు. వీరితో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న ప్రచారం ఉంది. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ బీజేపీలోకి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కాంగ్రెస్‌లోకి ఇది వరకే పార్టీ మారారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో పార్టీ బలహీన పడింది. పార్లమెంట్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పార్టీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. బూత్ స్థాయిలో కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు కేటీఆర్ పర్యటన తోడ్పడుతుందా? అనేది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment