ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీ పిస్తున్న తరుణంలో గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ మదిలో ఎవరెవరు ఉన్నారోనని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పలు అంశాలు తెరపైకి వస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు సూచనప్రాయంగా తమకే టికెట్లు ఖరారైనట్లు చెప్పుకుంటున్నారు.
కానీ ఇప్పటికీ అధికారికంగా జాబితా వెల్లడి కాలేదు. ఈ నెలలోనే మొదటి దఫా 70 వరకు స్థానాల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానా ల్లోనూ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరికీ టికెట్లు వస్తాయా..? లేక ఏయే స్థానాల్లో మార్పులు ఉంటాయా.. అనే తర్జన భర్జన నడుస్తోంది.
మెజార్టీ స్థానాల్లో పాత వారికే మళ్లీ టికెట్లు ఇస్తామని అప్పట్లో సీఎం ప్రకటించారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు సర్వేలో గ్రాఫ్ పడిపోవడం, ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రత్యర్థి కంటే వెనుకబడిపోవడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తామని పేర్కొన్నారు. ఆయా స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మెజార్టీ స్థానాల్లో ఒకే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో పది స్థానాల్లో ఆసిఫాబాద్ మినహా అన్ని చోట్ల బీఆర్‌ఎస్ జెండా ఎగురవేసింది. ఆ తర్వాత ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే ఆత్రం సక్కు సైతం పార్టీ మారడంతో ఉమ్మడి జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. కొన్ని చోట్ల రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ బలపడడంతో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న గులాబీ బాస్‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యతిరేకత ఉన్న వారిని మార్పు ఖాయంగా వినిపిస్తోంది.
ఆశావహుల ఆరాటం..
ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే తమను పరిశీలనలోకి తీసుకోవాలని బీఆర్‌ఎస్‌లోనే అనేకమంది బీ ఫామ్ కోసం వరుసలో ఉన్నారు. అధి ష్టానం దృష్టిలో పడేందుకు, ప్రజల్లో తమ బలం పెంచుకునేందుకు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి తామే ఎమ్మెల్యే అభ్యర్థులం అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు.
చివరి వరకు టెన్షన్ ?
మార్పులు చేసే చోట్ల ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి ఉంటే ఆ ఎమ్మెల్యేలకు చివరి క్షణం వరకు టెన్షన్ తప్పేలా లేదు. మొదటి జాబితాలో ఉన్న వారు ఉత్సాహంగా ప్రచారంలోకి దిగితే సీట్లు మార్చే చోట అందుకు భిన్నంగా ఉండనుంది.
‘ఒక వేళ ఈలోపు రాష్ట్ర, జిల్లా సమీకరణలు మారితే అందరికీ టికెట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు’ అని సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అభ్యర్థులను మార్చితే అందుకు తగిన వారుంటేనే పార్టీకి లాభం లేకపోతే ఇతరులు లభ్ధి పొందే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అధినేత మనసులో ఏముందోనని జాబితా వెలువడే వరకు పార్టీ శ్రేణుల్లో చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.
ఎక్కడెక్కడ మార్పు?
ఉమ్మడి జిల్లాలో ఆరు నుంచి ఏడు అసెంబ్లీ స్థానాల్లో దాదాపు పాత వారికే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో సిర్పూర్, ఆసిఫా బాద్, నిర్మల్, ఆదిలాబాద్, ముథోల్, చెన్నూరులో అభ్యర్థులకు ఢోకా లేనట్లు ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, బోథ్ స్థానాలపై ఊగిసలాట కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ స్థానాల్లో మార్పులు ఉంటాయా? కొత్త వారికి అవకాశాలు ఉంటాయా ? అనేది తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment