కేసీఆర్‌ కీలక నిర్ణయంతో.. ఉత్కంఠకు తెర! | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కీలక నిర్ణయంతో.. ఉత్కంఠకు తెర!

Published Sat, Mar 23 2024 8:05 AM | Last Updated on Sat, Mar 23 2024 1:24 PM

- - Sakshi

మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి

అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు

సంగారెడ్డి: మెదక్‌ లోక్‌సభ స్థానం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో శుక్రవారం కేసీఆర్‌ తన వ్యవసాయక్షేత్రంలో పార్టీకి చెందిన జిల్లా నాయకులతో సమావేశమయ్యారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితర నాయకులతో సుధీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం కేసీఆర్‌ ఈ మేరకు వెంకట్రాంరెడ్డికి మెదక్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేరు ఖరారైన విషయం విధితమే. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

మారిన నిర్ణయం వెనుక..
మెదక్‌ ఎంపీ టికెట్‌కు ముందుగా గజ్వేల్‌కు చెందిన మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డికి దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన నియోజకవర్గంలో ఎన్నికల పనిలో కూడా నిమగ్నమయ్యారు. పార్లమెంట్‌ స్థానం పరిధిలోని పటాన్‌చెరు తదితర అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో కూడా వంటేరు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్‌ తదితరులు ఆశించారు.

అయినప్పటికీ వంటేరు ప్రతాప్‌రెడ్డికి దాదాపు ఖాయమైందని గులాబీ పార్టీ వర్గాలు భావించాయి. అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ స్థానం నుంచి స్వయంగా అధినేత కేసీఆరే బరిలోకి దిగుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో అనూహ్యంగా వెంకట్రాంరెడ్డికి ఈ టికెట్‌ ఖరారు చేస్తూ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

సిద్దిపేట మాజీ కలెక్టర్‌గా..
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన వెంకట్రాంరెడ్డికి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సన్నిహిత సంబంధాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సిద్దిపేట కలెక్టర్‌గా ఆయన సుమారు ఐదేళ్ల పాటు పని చేశారు. అంతకు ముందు ఉమ్మడి మెదక్‌ జిల్లా డ్వా మా ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. జాయింట్‌ కలెక్టర్‌గా, అదనపు కలెక్టర్‌గా 2014 నుంచి 2017 వరకు పనిచేశారు.

మధ్యలో కొన్ని రోజులు మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా కూడా బాధ్యతల్లో కొనసాగారు. 2021లో కలెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకట్రాంరెడ్డికి కేసీఆర్‌ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న వెంకట్‌రాంరెడ్డికి అనూహ్యంగా మెదక్‌ అభ్యర్థిత్వం దక్కడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆర్థికంగా బలమైన నేత
కలెక్టర్‌గా, జాయింట్‌ కలెక్టర్‌గా, ఉన్నతాధికారిగా ఉమ్మడి మెదక్‌ జిల్లాతో సంబంధం ఉన్న వెంకట్రాంరెడ్డికి రాజకీయంగా పెద్దగా సంబంధాలు లేవు. 2021 నవంబర్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై నప్పటికీ.. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా పాల్గొన్న దాఖలాలు లేవు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకటీ రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా అధినేత నియమించినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న దాఖలాలు తక్కువ. కానీ ఆర్థికంగా బలమైన నేతగా పేరుంది. ఈ నేపథ్యంలో ఆయనను అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి చదవండి: రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకం! : ఎంపీ గోడం నగేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement