ఓరుగల్లు జన సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ, పక్కన బీజేపీ వరంగల్, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులు అరూరి రమేశ్, సీతారాంనాయక్
ఎటుచూసినా ప్రధాని బొమ్మలు, ప్లకార్డులు
వరంగల్ అంటే అభిమానమన్న ప్రధాని మోదీ
కష్టకాలంలో వెన్నంటి నిలిచిందని పాత గుర్తులు
బీజేపీ అభ్యర్థులను గెలిపించాలంటూ అభ్యర్థన
బీజేపీ ఓరుగల్లు జనసభకు హాజరైన వారికి నమస్కరిస్తున్న ప్రధాని మోదీ
సాక్షి, వరంగల్: వరంగల్ నగరం కాషాయ జెండాలతో రెపరెపలాడింది. వరంగల్, మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులు అరూరి రమేశ్, సీతారాంనాయక్‌ను గెలిపించాలంటూ గ్రేటర్ వరంగల్ పరిధిలోని మామునూరు తిమ్మాపూర్ క్రాస్‌రోడ్డు లక్ష్మీపురం మైదానంలో బుధవారం నిర్వహించిన ఓరుగల్లు జనసభలో ప్రధాని నమో నినాదం మార్మోగింది. సభలో ఎక్కడ చూసినా నమో బొమ్మలతో కూడిన ప్లకార్డులు కనిపించాయి. భారీ ఆకృతి లో ఉన్న ఫ్లెక్సీలు సభా ప్రాంగణంలో ప్రజలు పట్టుకొని ఉండడం చూసి మోదీ ఫిదా అయ్యారు.
ఓరుగల్లు అంటే అభిమానమంటూ..
‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు.. నా అదృష్టం ఏమిటంటే నేను పనిచేసినటువంటి అహ్మదాబాద్ అధిష్టాత్మి దేవత కూడా భద్రకాళి. ఆ భద్రకాళి అమ్మవారికి, ఆమె చరణాలకు నేను ప్రణామం చేస్తున్నా. ఇక్కడినుంచి కొంచెం దూరంలో ఉన్న రామప్ప మందిరానికి కూడా నేను నమస్కారాలు చేస్తున్నా. ఈ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవ పతాకకు ప్రతీక.
మూడో దశ పోలింగ్‌ను కూడా పూర్తి చేసుకొని ఇక్కడకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకునేటువంటి అదృష్టాన్ని పొందా’ అంటూ మోదీ ప్రసంగం ప్రారంభించడంతో సభికులు పెద్దపెట్టున మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. ‘నా దృష్టిలో వరంగల్ చాలా ముఖ్యమైనటువంటి చోటు. 40 సంవత్సరాల క్రితం బీజేపీకి ఇద్దరంటే ఇద్దరు ఎంపీలు ఉన్నప్పు డు అందులో ఒకరు మన హనుమకొండ నుంచి దివంగత నేత జంగారెడ్డి. బీజేపీ మీ అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు.
మాకు ఎప్పుడు కష్టం వచ్చినా వరంగల్ ప్రజానీకం వెన్నంటి నిలిచారు. అందుకే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఇనుపగుప్పిటనుంచి వరంగల్‌ను బయటకు తీసేందుకు బీజేపీ సర్వప్రయత్నాలను చేయబోతోంది’ అని వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. వరంగల్‌లో మేం టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుచేశాం. కానీ, పార్కు నిర్వహణ విషయంలో సమస్యలు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి, ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వాళ్లకు జవాబు చెప్పాల్సిన సమయం వచ్చింది. మీ అందరిని కోరుతున్నాను. వరంగల్ నుంచి అరూరి రమేశ్, మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్‌ను లోక్‌సభకు పంపించండి. మోదీకి బలం చేకూర్చండి అంటూ సభికులను ఆయన అభ్యర్థించారు. ఇంకోవైపు కళాకా రులు నిర్వహించిన కళానృత్యాలు అందరినీ అలరించా యి. మోదీ పాటలకు సభకు హాజరైన కొందరు స్టెప్పులేయడం కనిపించింది.
వేదికపై అగ్రనేతలు.. అభ్యర్థులు..
వేదికపై మోదీకి ఒకవైపు మహబూబాబాద్, వరంగల్ ఎంపీ అభ్యర్థులు సీతారాంనాయక్, అరూరి రమేశ్ ప్రజలకు నమస్కరిస్తూ కనిపించారు. మురళీ ధర్‌గౌడ్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అధ్యక్షతన సభ జరగగా. మోదీ ప్రసంగాన్ని హైదరాబాద్‌కు చెంది న రాక సుధాకర్ అనువదించారు.
ప్రధాన వేదికపై నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, చందుపట్ల కీర్తిరెడ్డి, పార్టీ వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, రావు పద్మ, నిశిధర్‌రెడ్డి, దశమంతరెడ్డితో పాటు నాయకులు కుమారస్వామి, మార్తినేని ధర్మారావు, గరికపాటి మోహన్‌రావు, కొండేటి శ్రీధర్, డాక్టర్ రాజేశ్వర్‌రావు, స్వాతిరెడ్డి, రావుల కోమల, జలగం అనిత, డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయరామారావు, అల్లం నాగరాజు, జలగం రంజిత్‌రావు, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మల్లాడి తిరుపతిరెడ్డి కూర్చున్నారు.
Comments
Please login to add a commentAdd a comment