ఉత్తర్వులు జారీచేసిన జగ్గారెడ్డి
కాంగ్రెస్‌లో ఫలించిన ‘కంది’ వర్గీయుల పోరాటం
ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరేళ్లపాటు పార్టీ బహిష్కరణకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్‌ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్‌రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.
ఇటీవల జగ్గారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈ ముగ్గురు ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌రెడ్డిని కూడా కలిశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈ ముగ్గురు నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవద్దంటూ కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.
వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ దహనం చేయడంతో పాటు నోటికి నల్లగుడ్డలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను గమనించిన పార్టీ నాయకత్వం వారి చేరికలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో కంది వర్గీయుల పోరాటం ఫలించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి ఆదేశాల మేరకు ఆ నాయకుల చేరికలను నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీమెంబర్ జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాయకత్వంతో చర్చించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు వారి చేరిక నిలిపివేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు.
ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు..
Comments
Please login to add a commentAdd a comment