తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును బెదిరిస్తున్నట్లుగా ఉంది. పులి బయటకు వస్తే బోనులో బంధిస్తామని చెప్పడం ద్వారా తన ఉద్దేశాన్ని ఆయన వెల్లడించారు. లండన్‌లో తన అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్‌ఎస్‌ను వచ్చే పార్లమెంటు ఎన్నికలలో వంద మీటర్ల లోతున పాతిపెడతామని కూడా ఆయన అన్నారు. లండన్ నుంచే ఆయన పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఆరంభించినట్లు అనిపిస్తుంది. నిజానికి విదేశాలకు వెళ్లినప్పుడు తన ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పడానికి సహజంగా యత్నిస్తారు. తన లక్ష్యాలను వివరిస్తారు. కాని రేవంత్ తన స్పీచ్లో కేసీఆర్‌ను, కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్గా చేసుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంది. రాజకీయాలలో ఎవరు ఎప్పుడు పులి అవుతారో, ఎప్పుడు పిల్లి అవుతారో చెప్పలేం. ఎవ్పుడైనా ,ఎవరైనా, ఏమైనా కావచ్చు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రేవంత్ రెడ్డే.
2015లో ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుపాలైనప్పుడు ఆయన భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించింది. శాసనసభ నుంచి ఆయన బహిష్కరణకు కూడా గురయ్యారు. తదుపరి 2018లో కొడంగల్ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందారు. అప్పుడు రేవంత్ రాజకీయంగా బాగా వెనకబడి పోయినట్లు అనిపించింది. కాని అదృష్టం కలిసి వచ్చి మల్కాజిగిరి నుంచి స్వల్ప ఆధిక్యతతో లోక్‌సభకు గెలవడం ఆయన రాజకీయ జీవితంతో ఒక పెద్ద మలుపు అయింది. తదుపరి రేవంత్ ఏకంగా పీసీసీ అధ్యక్షుడు అవడం, అనంతరం ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం జరిగింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా దురుసుగా మాట్లాడేవారు. కొన్నిసార్లు ఆయన భాషపై అభ్యంతరాలు వచ్చేవి. అయినా రేవంత్ తగ్గలేదు.
ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయనపై విమర్శలు బీఆర్‌ఎస్ వంతుగా మారింది. కేసీఆర్ ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. ఆయన కుమారుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కాని, మాజీ మంత్రి హరీష్ రావు కాని కాంగ్రెస్ హామీలను పదే, పదే గుర్తు చేస్తున్నారు. ప్రజలలో ప్రభుత్వంపై అసమ్మతి, అసంతృప్తి పెరిగేలా ఉపన్యాసాలు ఇస్తున్నారు. అది రేవంత్కు గుర్రుగానే ఉంటుంది. ఆయన మంత్రివర్గ సహచరుల ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆ క్రమంలోనే రేవంత్ తనదైన శైలిలో కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. 'ఎన్నికలలో బీఆర్‌ఎస్ బొక్కబోర్లాపడ్డా బుద్ది రాలేదు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్‌ఎస్ ఆనవాళ్లు కనిపించకుండా వంద మీటర్ల లోతున బొందపెడతాం. పులి బయటకు వచ్చేస్తోందంటూ బీఆర్‌ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారు. అందుకోసమే ఎదురుచూస్తున్నా.. నా దగ్గర బోను, వల ఉన్నాయి..' అని ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరమైన అంశమే.
అంటే దీని అర్ధం కాలు జారి పడ్డ కేసీఆర్ కోలుకుని మళ్లీ ప్రజాజీవనంలోకి వస్తే ఆయనను ఏదో కేసులో పెట్టి అరెస్టు చేస్తామని చెప్పడమేనా అన్న ప్రశ్న వస్తుంది. కాకపోతే, ఆ మాట ఆయన నేరుగా చెప్పలేదు. కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై చర్చ జరగకూడదని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలకు తెలియచేయరాదన్నట్లుగా బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రవర్తిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిజమే! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆత్మరక్షణలో ఉన్న బీఆర్‌ఎస్ ఆ విషయం తప్ప మిగిలిన అంశాలపైనే కేంద్రీకరిస్తుంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పదే, పదే ప్రస్తావించడం ద్వారా రేవంత్ను ఇరకాటంలోకి నెట్టడానికి కేటీఆర్, హరీష్రావు ఇతర నేతలు వ్యవహరిస్తారు. కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుని వాకర్ సాయంతో నడుస్తున్నారు. ఆయన తక్షణమే ప్రజలలో తిరగాలని అనుకోకపోవచ్చు. మహా వస్తే పార్టీ ఆఫీస్కు వచ్చి కాసేపు కూర్చుని వెళ్లవచ్చు.
ఎటూ మరో మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ తేల్చుకుందామని రేవంత్ అన్నట్లుగానే కేసీఆర్ కూడా అందుకు సిద్దం అవుతుండాలి. ఈలోగానే మాటల యుద్దంలో పైచేయి సాధించడానికి ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్‌ఎస్ కు కాళేశ్వరం వీక్ పాయింట్ అయినట్లుగానే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు వీక్ పాయింట్లు అవుతాయి. వాటిని అమలు చేయలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పైన, బీఆర్‌ఎస్ నేతలపైన విమర్శలు చేస్తున్నారన్న భావన ఏర్పడుతుంది. ఇంతవరకు ఆర్‌టీసీ బస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేశారు. దీనివల్ల మొదట కాస్త ఆకర్షణ ఏర్పడినా, రానురాను అది తగ్గుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. బస్లలో సీట్లు చాలకపోవడం, అందరిని ఎక్కించుకోకపోవడం, అన్ని బస్ లలో ఈ సదుపాయం లేకపోవడం, ఈ స్కీమ్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అనుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
దీనికన్నా వంట గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ఇచ్చే స్కీమ్ అమలు చేసి ఉంటే రేవంత్ ప్రభుత్వానికి ప్రజలలో ప్రత్యేకించి పేదవర్గాలలో గుడ్ విల్ పెరిగేది. కాని ఆ స్కీమ్ అమలు చేయాలంటే డబ్బు కూడా ఎప్పటికప్పుడు చెల్లించవలసి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. సుమారు కోటి మంది వరకు ఆ స్కీమ్ కింద సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏడాది అయ్యే వ్యయం సుమారు 2500 కోట్లు అని అంచనా వేశారు. దీనితో పాటు వృద్దులకు పెన్షన్ నాలుగువేల రూపాయలు ఇవ్వవలసి ఉంది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయవలసిన వాగ్దానాల జాబితా చాంతాడు అంత అవుతుంది.
ఈ నేపధ్యంలోనే కేటీఆర్ ఒక పిలుపు ఇచ్చారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందువల్ల జనవరి బిల్లులను చెల్లించవద్దని, ఆ బిల్లులను సోనియాగాంధీ చిరునామాకు పంపించాలని ఆయన ప్రజలకు సూచించారు. వీటిని గుర్తు చేస్తే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుంది. ఎందుకంటే వీటన్నిటిని అమలు చేయడం సాధ్యం కాదని వారికి తెలుసు కాబట్టి. బీఆర్‌ఎస్ ను వంద మీటర్ల లోతున బొందపెట్టడం సరే కాని, ముందుగా వంద రోజుల లోపు హామీలను అమలు చేయాలని, రేవంత్ మాదిరి అహంకారంగా మాట్లాడేవారిని చాలామందిని చూశామని ఆయన అన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రతిపక్షంపై వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావవడంతో వాటి రుచిని ఆయన చవిచూస్తున్నారు. రేవంత్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాధ్ షిండేతో పోల్చుతూ ఎప్పటికైనా కాంగ్రెస్ను చీల్చుతారన్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌ది బీజేపీ రక్తమని కూడా ఆయన అన్నారు.
రాజకీయంగా చూస్తే ఒకప్పుడు కేసీఆర్ కూడా టీడీపీవారే. అలాగే రేవంత్ కూడా తొలుత ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి అయినా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి తదుపరి కాంగ్రెస్లో చేరారు. కేసీఆర్ సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. రేవంత్కు కాంగ్రెస్‌ను చీల్చవలసిన అవసరం ఎందుకు వస్తుందో తెలియదు. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేస్తే అప్పుడు అలా అవుతారని చెప్పడం కేటీఆర్ ఉద్దేశం కావచ్చు. కాని ఇదేదో ఊహాజనిత విమర్శగా కనిపిస్తుంది. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికలు అటు రేవంత్ కు, ఇటు కేసీఆర్ కు ఇద్దరికి ప్రతిష్టాత్మకమే. మధ్యలో బీజేపీ తన వంతు గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోలేకపోతే అప్పుడు ఆ పార్టీలో అసమ్మతి పెరిగితే పెరగవచ్చు. ఎక్కువ స్థానాలు గెలిస్తే మాత్రం రేవంత్‌కు డోకా ఉండదనే చెప్పాలి. కేసీఆర్ కు కూడా పరీక్ష సమయమే. గౌరవప్రదమైన సంఖ్యలో లోక్ సభ సీట్లు గెలుచుకోలేకపోతే బీఆర్‌ఎస్ క్యాడర్ కు భవిష్యత్తుపై అనుమానాలు వస్తాయి. మరో నాలుగేళ్లపాటు పార్టీని నడపడానికి చాలా కష్టాలు పడవలసి ఉంటుంది.
ఎందుకంటే గతంలో మాదిరి సెంటిమెంట్తో రాజకీయాలు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. రేవంత్ డావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్దం జరిగింది. రేవంత్ గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానిని విమర్శించేవారు. ఆ మాటకు వస్తే రాహుల్ గాంధీ సైతం ఆదానిపై విరుచుకుపడుతుంటారు. డావోస్ లో మాత్రం అదానిని రేవంత్ కలవడం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాంగ్రెస్ తన విధానం మార్చుకుందా? లేక అవకాశవాదంతో పోతోందా అనే సందేహం వస్తుంది. మూసి నదికి సంబంధించి శుద్ది చేయాలన్న ఆలోచనలు బాగానే ఉన్నాయి. లండన్లో దీనిపై చర్చలు జరిపే నెపంతో ఎమ్.ఐ.ఎమ్. నేత అక్బరుద్దీన్ ఓవైసీని పిలిపించుకోవడంలో రాజకీయం కూడా ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. రేవంత్ రెడ్డిని తన బ్లాక్ మెయిల్ ద్వారా ఒక మీడియా యజమాని ఇప్పటికే లొంగదీసుకున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అదే కొనసాగితే రేవంత్ కు కొత్త చిక్కులు రావచ్చు.
ప్రస్తుతం రేవంత్కు ఆ మీడియా పెట్టే జాకీలపై ఆధారపడకుండా, తన స్వశక్తి ద్వారా ప్రజలలో ఆదరణ పొందగలిగితేనే నిలబడగలుగుతారు.లేకుంటే రాజకీయంగా చేదు అనుభవాలు ఎదురు అవుతాయి. ఉదాహరణకు మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలవలేదు. గతసారి ఇక్కడ నుంచే రేవంత్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈసారి జరిగే ఎన్నికలలో అదే పరిస్థితి ఎదురైతే ఆయన నైతికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరో సంగతి ఏమిటంటే రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు వ్యతిరేకంగా మాట్లాడినట్లు, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఫర్వాలేదు కాని, బీఆర్‌ఎస్ మాత్రం ఉండకూడదన్నట్లు మాట్లాడినట్లు తోక పత్రిక యజమాని ప్రచారం చేస్తున్నారు. నిజంగా మోదీ ఒక కాంగ్రెస్ నేతతో అలా అంటారా అన్నది డౌటే.
కల్పిత కధలు రాయడంలో దిట్టగా పేరిందిన ఈయన మాటలు జనం ఎవరూ నమ్మరు. అలాగే టీడీపీకి మద్దతు ఇచ్చే మరో పత్రిక పట్ల కూడా రేవంత్ వ్యవహరించే శైలిని కూడా ప్రజలు గమనిస్తారు. ఉదాహరణకు రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక ప్రమాదంలో ఒక ప్రముఖ కంపెనీ సీఈఓ మరణించారు. ఈ కేసును రేవంత్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. రేవంత్ తమ చెప్పుచేతలలో ఉన్నాడని ఆ పత్రిక యాజమాన్యం భావిస్తోందని చెబుతారు. ఇలా తెలుగుదేశం మీడియా గుప్పిట్లోనే రేవంత్ కనుక కొనసాగితే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. వారితో తగాదా తెచ్చుకోవాలని చెప్పడం లేదు కాని వారి ఆటలకు అనుగుణంగా రేవంత్ డాన్స్ చేస్తే మాత్రం అప్రతిష్టపాలవుతాడని చెప్పకతప్పదు. మొత్తం మీద చూస్తే బీఆర్‌ఎస్ తనపై ఆరోపణలు జనంలోకి వెళ్లకుండా చూడడానికి విశ్వయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోతే బాగుండు అన్నట్లుగా వ్యవహరిస్తుందని భావించవచ్చు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment