తెలంగాణలో ‘జంపింగ్స్‌’ గేమ్‌.. తిలాపాపం తలా పిడెకడు! | Kommineni Srinivasa Rao Analysis On Telangana Politics | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ‘జంపింగ్స్‌’ గేమ్‌.. తిలాపాపం తలా పిడెకడు!

Published Thu, Jul 18 2024 12:58 PM | Last Updated on Thu, Jul 18 2024 1:20 PM

Kommineni Srinivasa Rao Analysis On Telangana Politics

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో ప్రచారంలోకి వచ్చింది. అది ఏమిటంటే మాజీ మంత్రులు , బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ,  హరీష్ రావులు ప్రస్తుతం జరుగుతున్న ఫిరాయింపులపై తీవ్రంగా చేస్తున్న విమర్శలు ఒకవైపు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు ఫిరాయింపులను సమర్ధిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకోవైపు ఉన్నాయి. ఫిరాయింపు రాజకీయాల విషయంలో ఒకరినే తప్పుపట్టే పరిస్థితి లేదు. తిలాపాపం తలా పిడెకడు అన్నట్లుగా రాజకీయ నేతలు దాదాపు అందరూ ఈ దిక్కుమాలిన రాజకీయానికి పాల్పడుతున్నారు. కొన్నిసార్లు తమ పార్టీని రక్షించుకోవడానికి అయితే, మరికొన్నిసార్లు ఎదుటి పార్టీని దెబ్బతీసేందుకు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. వీరిని ఉద్దేశించి కేటీఆర్ ఒక మాట అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీని వీడి కేశవరావు, కడియం శ్రీహరి వంటివారు వెళ్లారని, పార్టీని వీడడం అంటే తల్లికి ద్రోహం చేసినట్లే అని అన్నారు. వీరిపై స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. 

సుప్రింకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి ఫిరాయింపుదారులపై అనర్హత ఓటు వేయాలని డిమాండ్ చేశారు. అలాగే హరీష్ రావు కూడా ఘాటైన విమర్శలు చేశారు. గతంలో కూడా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను లాక్కున్నారని, అయినా పార్టీకి ఏమీ కాలేదని కూడా ఆయన చెబుతున్నారు.  దీనికి ప్రతిగా  బీఆర్ఎస్ వ్యతిరేకులు  గతంలో శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ అన్న వ్యాఖ్యల వీడియోని జవాబుగా చూపుతున్నారు. అందులో ఆయన ఏమంటారంటే కాంగ్రెస్ ,ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు వస్తున్నారంటే అది తమ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

 కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతోందని ఆయన ఎద్దేవ చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా!బండ్లు ఓడలు అవుతాయి..ఓడలు బండ్లు అవుతాయి అన్న చందంగా తెలంగాణలో బీఆర్ఎస్ అదికారం కోల్పోవడం, కాంగ్రెస్ పవర్ లోకి రావడం జరిగిపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేమ్ మొదలైంది. ఈ గేమ్ లో కాంగ్రెస్ పక్షాన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ తో పొత్తులో ఉన్న టీడీపీ అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ కు తోడ్పడుతున్నారా అన్న  అభిప్రాయాన్ని  పలువురు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ప్రస్తుతం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రకాష్ గౌడ్,అరికపూడి గాంధీలు కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ముందుగా చంద్రబాబును కలవడం. 

దాంతో ఆయన సూచన మేరకే వీరు పార్టీ మారారేమో  అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీరు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ ను వదలి విజయవాడ వెళ్లిపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకున్నారు. 2014 లో  పదిహేను మంది టీడీపీ పక్షాన ఎన్నికైతే ముగ్గురు తప్ప మిగిలిన పన్నెండు మంది అప్పటి టీఆర్‌ఎస్‌ లో చేరి పోయారు. ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో బీఆర్ఎస్ లో టీడీపీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసినట్లు ప్రకటించేశారు.అప్పట్లో వీరిపై రేవంత్ రెడ్డి పోరాడారు.సుప్రింకోర్టువరకు వెళ్లే యత్నం చేశారు. సరిగ్గా ఇప్పుడు అదే పనిలో కేటీఆర్,హరీష్ రావులు ఉండడం విశేషం.   ఆ తర్వాత కాలంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారు.విశేషం ఏమిటంటే 2014 లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన 21 మందిలో మెజార్టీ సభ్యులు  టీఆర్‌ఎస్‌ లో చేరిపోయారు. తదుపరి 2018 లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది గెలిస్తే పన్నెండు  మంది టీఆర్‌ఎస్‌‌లో విలీనం అయిపోయారు. 

ఈ రకంగా తనకు ఎదురులేని పరిస్థితిని కేసీఆర్ సృష్టించుకున్నారు. ఆ తర్వాత పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుకున్నారు. ఆ పేరుతోనే 2023 ఎన్నికలలో పోటీచేసి కాంగ్రెస్ చేతిలో చతికిల పడ్డారు. పీసీసీ అద్యక్షుడుగా పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో కేసీఆర్ గేమ్ ముగిసి రేవంత్ ఆట ఆరంభం అయింది. బీఆర్ఎస్‌ ను ఖాళీ చేయించే పని పెట్టుకున్నారు. కేసీఆర్ మాదిరే ఈయన కూడా ఈ వ్యవహారాన్ని సమర్ధించుకుంటున్నారు.తమ ప్రభుత్వ అభివృద్దిని చూసి ఎమ్మెల్యేలు చేరుతున్నారని చెబుతున్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే తాము చూస్తూ ఊరుకుంటామా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో కేటీఆర్,హరీష్ రావు ఎంత గొడవ చేసినా, ఎన్ని విమర్శలు చేసినా వారికి నైతికంగా ఫిరాయింపులపై విమర్శ చేసే హక్కు కోల్పోయారు. బహుశా ఈ నేపద్యంలోనే కేసీఆర్ ఫిరాయింపులను విమర్శిస్తూ బహిరంగంగా మాట్లాడుతున్నట్లు అనిపించడం లేదు.

కాకపోతే తన ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను పిలిపించుకుని మాట్లాడి బుజ్జగింపు యత్నాలు చేస్తున్నారు. మళ్లీ అధికారం వచ్చే అవకాశం ఉందని ఆయన విశ్వాసం పాదుకొలిపే యత్నం చేస్తున్నారు. తెలంగాణలో వచ్చిన చిక్కు ఏమిటంటే కాంగ్రెస్ తో పాటు,బీజేపీ , బీఆర్ఎస్ లు  కూడా అధికారం కోసం పోటీ పడుతుండడం, ముక్కోణపు రాజకీయం అవడం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. అదే బీజేపీ  కనుక బాగా బలహీనంగా ఉన్నట్లయితే బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానప్రతిపక్షంగా పోటాపోటీగా ఉండేది. కాని ఆశ్చర్యంగాబీజేపీ  గత లోక్ సభ ఎన్నికలలో పుంజుకుని కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది సీట్లు గెలుచుకుంది.దాంతోబీజేపీ  కూడా వచ్చే శాసనసభ ఎన్నికల నాటి బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికైతే బీజేపీ  బదులు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. 

అందువల్లే పది మంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. వారిలో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీలు టీడీపీలో కూడా సీనియర్ నేతలుగా ఉండేవారు.తదుపరి టీఆర్‌ఎస్‌ లో చేరారు. అక్కడ అధికారం చవిచూసిన వీరు  మళ్లీ అధికార పక్షమైన కాంగ్రెస్ లో ప్రవేశించారు. వారంతా కాంగ్రెస్ లో చేరడం వల్ల రేవంత్ కు మరింత బలం వస్తుందని చెప్పవచ్చు.ఇక దానం నాగేందర్,కాలె యాదయ్యలు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో అటు దూకారు. తిరిగి కాంగ్రెస్ పవర్‌ను సాధించడంతో వారు మళ్లీ ఇందులోకి దూకేశారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారం ఎటు ఉంటే అటు చేరడానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇష్టపడుతున్నారు. అధికారంలో లేకపోతే నియోజకవర్గాలలో అసలు పనులు జరగవని, చివరికి పోలీస్ స్టేషన్‌లలో తమ మాట వినరని భయపడుతున్నారు. 

ఇతరత్రా ప్రభుత్వంతో ఉండే లావాదేవీల రీత్యా అధికారపార్టీలోకి వెళ్లడం మామూలు అయిపోయింది. దానం నాగేందర్ ది ఆసక్తికరమైన స్టోరీ అని చెప్పాలి. 1994లో టీడీపీ వేవ్ లో కాంగ్రెస్ పక్షాన అసిఫ్ నగర్ నుంచి గెలిచారు. 1999లో కూడా ఆయన గెలుపొందారు. కాని 2004లో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపీగా పోటీచేయాలని సూచిస్తే,తిరస్కరించి రాత్రికి రాత్రే టీడీపీలో చేరిపోయారు. మళ్లీ గెలవగలిగారు. కాని టీడీపీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ గెలిచింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎతో  ఉన్న సంబందాల రీత్యా ఆయన వెంటనే పార్టీ మారిపోయారు. పద్దతి ప్రకారం  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాని ఉప ఎన్నికలో ఓటమి చవిచూడడం ఆయనకు ఎదురుదెబ్బ అయింది. 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచారు. 2014 వరకు మంత్రిగా కూడాఉన్నారు. 2014 ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత ఆయన చూపు బీఆర్ఎస్ వైపు మళ్లింది. ఎలాగైతేనేమి ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఉన్నా బీఆర్ఎస్ సీటు సంపాదించి 2018లో గెలుపొందారు. అలాగే 2023 లో సైతం విజయం సాధించారు. ఆయన ఈసారి గెలిచినా బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. 

దాంతో అధికారంలో ఉన్న కాగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఈ విడత  పదవికి రాజీనామా చేయకపోగా, కాంగ్రెస్ పార్టీ పక్షాన లోక్ సభకు పోటీచేసి ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఒక అంశాన్ని పెట్టినా, దానిని పాటించడం లేదు.ఇంకో సంగతి ఏమిటంటే దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు భూ కబ్జా ఆరోపణలు చేస్తుండేవారు. ఆయన కాంగ్రెస్ లో చేరడంతో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారన్నమాట. ఆయన ఒక్కరనే కాదు. ఇలా పార్టీ మారే ఎమ్మెల్యేలందరికి వారి,వారి కారణాలు ఉంటాయి. టీఆర్‌ఎస్‌ నుంచి మరో ఇరవైమందిని లాగితే బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ ఎలాగైతే గతంలో  విలీనం చేసుకుందో ,అదే రీతిలో బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా రేవంత్ పావులు కదుపుతున్నారు.

 రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావునుకూడా కాంగ్రెస్ లోకి ఆకర్షించినా, ఆయన పదవికి రాజీనామా చేసి రావడం మంచిదే. ఇప్పుడు ఆ సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాగడం అంటే రకరకాల వ్యూహాలు ఉండవచ్చు. కొందరికి కాంట్రాక్టులు ఇవ్వవచ్చు. మరికొందరికి ప్యాకేజీలు ఉండవచ్చు.ఇంకొందరు నియోజకవర్గంలో పనులు,ఆదిపత్యం కోసం వెళ్లవచ్చు. రాజకీయాలలో వచ్చిన కొత్త ట్రెండ్ ఏమిటంటే  విపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కన్నా, ఎన్నికలలో పోటీచేసి ఓటమిచెందిన అధికార పార్టీ నేతే పవర్ పుల్ గా ఉండడం. ఆయన ఏమి చెబితే దానినే అధికారులు పాటిస్తూ ఉంటారు. పేరుకు ఎమ్మెల్యేనే కాని ఆయన చెబితే పెద్దగా పనులు జరగవు. దీని దృష్ట్యా కూడా విపక్ష  ఎమ్మెల్యేలు  ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ కి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

 వీరెవరూ ఫిరాయింపుల వైపు చూడడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండడమే కారణం కావచ్చు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ  బాగా బలపడితే మాత్రం ఫిరాయింపుల పర్వం కొత్త అంకంలోకి వెళుతుంది. అలాకాకుండా బీఆర్ఎస్ పుంజుకుని శాసనసభ ఎన్నికలలో విజయావకాశాలు ఉన్నాయని జనం భావించే పరిస్థితి ఏర్పడితే ,అప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్లీ ఇటువైపు దూకవచ్చు. ఈలోగానే బీఆర్ఎస్ ను సాద్యమైనంతగా వీక్ చేయాలన్నది రేవంత్ ఆలోచన అన్నది వేరే చెప్పనవసరం లేదు.ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ,తెలుగుదేశంల మద్యే ప్రధాన పోటీ ఉండేది. ఏదో ఒక పార్టీ ప్రతిపక్షంగా గట్టిగా పోరాడగలిగేది. టీఆర్‌ఎస్‌ ఈ రెండిటిలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని రెండు ఎన్నికలలో పోటీచేసింది. 

2014 నుంచి సొంతంగానే పోటీచేస్తోంది. ఇప్పుడు బీజేపీ  కూడా గణనీయంగా పుంజుకోవడంతో బీఆర్ఎస్‌కు  చిక్కులు వస్తున్నాయి. వీటిని అధిగమించగలిగి బీఆర్ఎస్ పోరాటాలు చేయగలిగితే తెలంగాణ రాజకీయాలలో ప్రజల శక్తిగా ఉండి మళ్లీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలా జరుగుతుందా?లేదా? అన్నది తేలడానికి మరో రెండు,మూడేళ్లు పట్టవచ్చు. అధికారం లేనప్పుడు మొహం చాటేసే నేతలు కూడా గణనీయంగానే ఉంటారు. అదేమి ఊహించనిది కాదు.  బీఆర్ఎస్ ఇప్పుడున్న  రాజకీయాలలో వీలైనంతవరకు ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే మంచిదే. అలా నిలబెట్టుకోలేకపోతే కేసీఆర్ గతంలో చెప్పిన  సూత్రం ప్రకారం  అది ఆయన తప్పే అవుతుంది. ఫిరాయింపులపై ఏమి మాట్లాడినా అది వారికే తగులుతుంది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం ప్రజలను నమ్ముకుని స్పష్టమైన విధానాలతో ముందుకు వెళ్లడం తప్ప గత్యంతరం లేదు. 

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement