బీబీ పాటిల్
ప్రజల్లోకి వెళ్లేందుకు బీబీ పాటిల్ యత్నాలు
పార్టీ టికెట్ ఆశావహులతో సంప్రదింపులు
బీజేపీ క్యాడర్‌తో మమేకమయ్యేందుకు కార్యాచరణ
మెదక్: బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మరుసటి రోజే అనూహ్యంగా జహీరాబాద్ ఎంపీ టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రజల దగ్గరకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అంతే కాకుండా పార్టీ క్యాడర్‌తో మమేకమై ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్త, బీజేపీ నేత పైడి ఎల్లారెడ్డిని కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మాజీ ఎంపీ దివంగత ఎం.బాగారెడ్డి కుమారుడు ఎం.జైపాల్‌రెడ్డిని ఫోన్‌ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినా అందుబాటులోకి రాలేదని సమాచారం. జైపాల్‌రెడ్డి టికెట్‌ను గట్టిగా ఆశించారు. అతను చివరి వరకు పోటీలో ఉన్నా అనూహ్యంగా బీబీ పాటిల్‌కు టికెట్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీబీ పాటిల్ తనతో ఉన్న క్యాడర్‌ను బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
పాటిల్ 2014 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు పెద్దగా తెలియని వ్యక్తి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అయినా ఈయన మహారాష్ట్రలో నిర్మాణ రంగంతో పాటు వివిధ వ్యాపారాలు చేసుకునేవారు. అప్పట్లో పాటిల్ బీజేపీ టికెట్‌ను ఆశించినా దక్కలేదు. తర్వాత పలు కారణాల వల్ల బీఆర్‌ఎస్ ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీలో చేరి జహీరాబాద్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. 1.44లక్షల మెజార్టీతో గెలిచి తొలిసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. అనంతరం పార్లమెంట్ పరిధిలోని తన పార్టీ ఎమ్మెల్యేలతో కొంత గ్యాప్ పెరిగింది.
అయినా రాష్ట్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలుండడం వల్ల 2019 ఎన్నికల్లోనూ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి అంచువరకు వెళ్లి 6,229 మెజార్టీతో బయట పడ్డారు. ఎమ్మెల్యేలు సహకరించడం లేదని ఆయన పలుమార్లు అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తపరిచారు. అధికారిక కార్యక్రమాల్లో, సీఎం, మంత్రుల సభల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి తన పార్లమెంట్ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment