‘పట్నం’ కాంగ్రెస్‌లో ముసలం! | - | Sakshi
Sakshi News home page

‘పట్నం’ కాంగ్రెస్‌లో ముసలం..! పార్టీని వీడే యోచనలో పలువురు కౌన్సిలర్లు

Published Sun, Jul 16 2023 5:14 AM | Last Updated on Sun, Jul 16 2023 12:30 PM

- - Sakshi

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. ఓ వైపు ఎన్నికల గడువు సమీపిస్తుండగా.. మరో వైపు పార్టీలో అంతర్గత పోరు తార స్థాయికి చేరుకుంది. ఇప్పటికే పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలో చేరగా.. తాజాగా మరికొంత మంది అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఉన్నత స్థాయి నేతల తీరుతో అప్రతిష్ట పాలవుతోంది. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, సీనియర్‌ నేతలు దండెం రామిరెడ్డి, మర్రి నిరంజన్‌రెడ్డి నియోజకవర్గంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ సంక్షోభ సమయంలో అంతా కలిసి పని చేయాల్సి ఉండగా.. ఎవరికి వారే అనే చందంగా సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ నాకంటే.. నాకే వస్తుందని ప్రచారం చేసుకుంటూ గ్రూపు రాజకీయాలకు తెరలేపారు. వీరి ప్రవర్తన నచ్చక ఇప్పటికే గ్రామాల్లోని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరడం గమనార్హం. తాజాగా తుర్కయాంజాల్‌, పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపాలిటీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు సైతం పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

నేతల మధ్య కొట్లాట

పట్నం నియోజకవర్గానికి 1952 నుంచి 2018 వరకు 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సార్లు కాంగ్రెస్‌, మూడుసార్లు సీపీఎం, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి బీఆర్‌ఎస్‌ గెలుపొందాయి. జిల్లాలో కాంగ్రెస్‌కు మంచి పట్టున్న నియోజకవర్గాల జాబితాలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. 2018 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా ఈ సీటును సామరంగారెడ్డికి త్యాగం చేయాల్సి వచ్చింది.

అప్పటికే కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి పొత్తులో భాగంగా భంగపడిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఆ తర్వాత బీఎస్పీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం జరిగిన సర్పంచ్‌, మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే మెజార్టీ సీట్లు దక్కించుకున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి గట్టిపట్టుంది. అయితే ప్రస్తుతం సీనియర్‌ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పార్టీకి శాపంగా మారాయి.

మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటుండగా.. మరో వైపు ఎంపీ కోమటిరెడ్డి వర్గంగా చెప్పుకుంటున్న మర్రి నిరంజన్‌రెడ్డి, గ్రేటర్‌ పరిధిలోని ఓ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు సన్నిహితుడిగా చెప్పుకొనే దండెం రామిరెడ్డి సైతం ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి సొంత నియోజకవర్గంలోనే పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడటం విశేషం.

పార్టీని వీడే యోచన

తుర్కయాంజాల్‌ మున్సిపల్‌ పరిధిలోని మాజీ ఎంపీపీ, రైతుసేవా సహకార సంఘం బ్యాంకు మాజీ చైర్మన్‌ రొక్కం భీంరెడ్డి సహా ఎనిమిది మంది కౌన్సిలర్లు, మరో ముగ్గురు కో ఆప్షన్‌ మెంబర్లు కాంగ్రెస్‌ను వీడి.. బీఆర్‌ఎస్‌లో చేరే యోచ నలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరంతా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. భీంరెడ్డి గతంలో టీడీపీలో పని చేశారు. 2018లో టీడీపీ టికెట్‌ ఆశించారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మల్‌రెడ్డి రంగారెడ్డి, భీంరెడ్డికి మధ్య సఖ్యత లేదు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రెండున్నరేళ్లకు చైర్మన్‌ పీఠాన్ని భీంరెడ్డి కోడలికి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అది నిలబెట్టుకోలేదు. దీంతో వారంతా పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

భీంరెడ్డి వర్గీయులు పార్టీ వీడకుండా మల్‌రెడ్డి వర్గీయులు బుజ్జగింపులు.. బేరసారాలకు దిగుతున్నారు. అయినా వారు పట్టు వీడటం లేదు. ఈ నెల 19న మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వీరంతా పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపాలిటీలోని పలువురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మల్‌రెడ్డి సోదరుల నాయకత్వాన్ని విభేదిస్తున్నారు. వీరంతా పక్క బాటపట్టే అవకాశం లేకపోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement