సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ ఆర్మూర్/ నిర్మల్: తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం కాబట్టి వ్యవసాయ స్థిరీకరణతోనే గ్రామాలు పటిష్టం అవుతాయని గుర్తించి చర్యలు చేపట్టామని.. రైతుల గోస తీర్చామని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. దేశ చరిత్రలో లేని స్థాయిలో 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకాలను వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌తోపాటు ఐక్యరాజ్యసమితి కూడా మెచ్చుకుందని చెప్పారు. ఇప్పుడు ఎరువుల కోసం చెప్పుల లైన్లు లేవని, కల్తీ విత్తనాలు లేవని తెలిపారు. ఎవరు మంచి చేశారో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా, జగిత్యాల జిల్లా కోరుట్ల, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
వివరాలు కేసీఆర్ మాటల్లోనే.. ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు. అది దేశ భవిష్యత్తుకు బాట వేస్తుంది. గుడ్డిగా ఓటు వేయొద్దు. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీలను, వాటి నడవడికను చూడాలి. ఈ అంశా లపై మీ ఊళ్లలో చర్చ పెట్టాలి. అలాగైతే మంచి నాయకులు వస్తరు, మంచి ప్రభుత్వాలు వస్తాయి. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది? అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో ఆలోచించాలి. గతంలో పోచంపల్లి, దుబ్బాకలలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు నేతన్నలు చనిపోతే.. లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని అప్పటి సీఎంను కోరాం. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. ఎరువుల కోసం చెప్పుల లైన్లతో.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల బస్తాల కోసం రైతులు పోలీస్‌స్టేషన్ల దగ్గర గంటల తరబడి నిలబడేది. చెప్పులు లైన్లలో పెట్టి ఎదురుచూసేది. ఆ పరిస్థితిని మార్చాం. కల్తీలేని విత్తనాలను కూడా అందుబాటులోకి తెచ్చాం." అని సీఎం కేసీఆర్ అన్నారు.
"ధరణిని రద్దు చేస్తామని, రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ధరణితో దళారులు, లంచావతారాల బెడద, వ్యవసాయ భూముల్లో అక్రమాల బాధ తప్పాయి. ఇప్పటికే రెండుసార్లు రైతు రుణాలను మాఫీ చేశాం. ఈసారి రూ.లక్షకుపైగా ఉన్న రుణాలు మాఫీచేసేలోగా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. రోడ్డును చూస్తే తేడా తెలుస్తది. పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి మీరు వస్తుంటే మన తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని రోడ్లే చెప్తాయి. ఎక్కడి నుంచి రోడ్డు నున్నగా వస్తదో అక్కడి నుంచే తెలంగాణ అని మహారాష్ట్రవాళ్లు అంటున్నరు. అది మన అభివృద్ధికి సూచిక. ఇళ్లు, పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయ రంగాలకు 24 గంటలపాటు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర మనదే. మహారాష్ట్రలో కరెంటు లేదు. " అని సీఎం కేసీఆర్ చెప్పారు.
" మన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు వందల ఏళ్ల నుంచి భైంసా, ముధోల్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లలో హిందువులు, ముస్లింలు కలసిమెలసి ఉండి పని చేసుకుంటున్నరు. భైంసా అంటే రోజూ కొట్టుకుంటారనే అబద్ధాలు ప్రచారం చేసి, మన మధ్యనే చిచ్చు పెట్టాలని చూస్తున్నరు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ, లాఠీచార్జి లేదు. తెలంగాణ ప్రశాంతంగా ఉండాలా లేక మతపిచ్చి మంటలతో నెత్తురు పారాలా? కేసీఆర్ బతికున్నంతకాలం తెలంగాణ సెక్యులర్‌గానే ఉంటుంది. గత పదేళ్లలో మైనారీ్టల సంక్షేమానికి రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. బీడీ కార్మికులకు కొత్త పింఛన్లు బీడీలు చేసే వారి బాధలు నాకు తెలుసు. ఎవరూ దరఖాస్తు చేసుకోకముందే వారికి పింఛన్ ఇచ్చిన. బీడీ కార్మికులకు పింఛన్ రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు దశలవారీగా పెంచి ఇస్తాం. కొత్తగా నమోదు చేసుకున్న బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్, జీవన్‌రెడ్డి, కేటీఆర్‌లు కోరు తున్నారు. తప్పకుండా ఇస్తాం’’ అని చెప్పారు.
ఇదీ చదవండి: మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా పునర్నిర్మించాల్సిందే..!
Comments
Please login to add a commentAdd a comment