
న్యూఢిల్లీ: విమానాలు, హోటళ్ల తరహాలోనే త్వరలో సీట్లు భర్తీకాని రైళ్లలో టికెట్ ధరలో డిస్కౌంట్ అందజేస్తామని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులతో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న గోయల్.. డిస్కౌంట్లు ఇచ్చే ప్రతిపాదనను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.
భర్తీకాని రైళ్లలో టికెట్లను డిస్కౌంట్ ధరలకు అందించడంపై రైల్వేబోర్డు చైర్మన్ అశ్వినీ లోహానీ అనుభవం తమకు ఉపయోగపడుతుందన్నారు. పండుగ సీజన్లలో, వారాంతాల్లో, రద్దీ తక్కువగా ఉండేకాలంలో టికెట్ ధరల్ని సవరించేందుకు ఫ్లెక్సీ ఫేర్ వ్యవస్థలో మార్పులు చేస్తామన్నారు. మహిళల భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీటీవీలను అమర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.