28 కోట్ల మంది చీకట్లలోనే!
కేంద్ర మంత్రి గోయల్
మొహాలీ: దేశంలో నేటికీ 28 కోట్ల మంది ప్రజలు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారని...వారి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేదని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వంటి మౌలిక సౌకర్యం నేటికీ వారికి అందుబాటులో లేకపోవడం బాధాకరమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2019కల్లా దేశంలోని అన్ని ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు.
ఆదివారం మొహాలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్‌లో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో విస్తృతంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా అవసరమైన మేర ట్రాన్స్‌మిషన్ లైన్లు లేకపోవడంతో కరెంటును దేశవ్యాప్తంగా సరఫరా చేయలేకపోతున్నామన్నారు.