పన్ను వసూలుపై కుదరని ఏకాభిప్రాయం
అసంపూర్తిగా ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం: ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) కౌన్సిల్ సమావేశం శుక్రవారం అసంపూర్తిగా ముగిసింది. పన్ను వసూలు విధానంపై కౌన్సిల్‌లో రోజంతా సుదీర్ఘ చర్చ జరిగినప్పటికీ... ఏయే ఆదాయ పరిధిలోని డీలర్ నుంచి పన్ను ఎవరు వసూలు చేయాలనే విషయంపై ఏకాభిప్రాయం కుదరలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ నెల 20న జరిగే రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈటల పాల్గొన్నారు. ఆచరణాత్మక పన్ను విధానంతో జీఎస్టీని వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సమర్థవంతంగా అమలులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.
రాష్ట్రాల ద్వారా 70 శాతం పన్ను!: రూ.1.5 కోట్ల ఆదాయం ఉన్న డీలర్ల నుంచి రాష్ట్రాలు, ఆపైన ఆదాయమున్న డీలర్ల నుంచి కేంద్ర ప్రభుత్వం వసూలు చేయాలని... మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో 70% రాష్ట్రాల ద్వారా, 30% కేంద్రం ద్వారా వసూలు చేయాలన్న అంశంతో పాటు మరికొన్ని ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వీటిపై ఈ నెల 20న జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. ఏ వస్తువు ఏ పన్ను శ్లాబ్ పరిధిలోకి వస్తుందనే అంశంపై ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నులను అధ్యయనం చేసి ఓ నిర్ణయానికి వస్తారన్నారు. ఈటలతో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.