హైదరాబాద్‌లో జీఎస్టీ కౌన్సిల్ భేటీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నగరంలో తొలిసారి జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ భేటీ ప్రారంభమైంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన 21వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. అంతకుముందు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీతో తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. జీఎస్టీ విషయమై తెలంగాణ ప్రభుత్వం పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ప్రజోపయోగ పనులపై జీఎస్టీని ఎత్తివేయాలని తెలంగాణ సర్కారు కోరుతూ వస్తోంది. ఒకవేళ పూర్తిగా జీఎస్టీని ఎత్తివేయడం సాధ్యపడకపోతే.. 18 నుంచి 5శాతానికి పన్ను కుదించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ విషయాన్ని ఈటల రాజేందర్ ప్రధానంగా లేవనెత్తే అవకాశముంది.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు
జీఎస్టీ సమావేశంలో తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు. సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున జైట్లీ, వివిధ రాష్ట్రాల మంత్రులు, అతిథుల బృందానికి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇవ్వనున్నారు. సమావేశానికి వచ్చే అతిథులకు పోచంపల్లి చేనేత వస్త్రాలతోపాటు రాష్ట్ర పర్యాటక వివరాలు, చారిత్రక సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టే జ్ఞాపికలను బహూకరించనున్నారు.