సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సారైనా సరిపడేన్ని నిధులు కేటాయిస్తుందని అంచనాలు వేసుకుంటోంది. గడిచిన మూడేళ్లు రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో చెప్పుకోదగ్గ కేటాయింపులు లేకపోవటం తెలంగాణను నిరాశకు గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు తగినంత ఆర్థిక సాయం చేయాలని పదే పదే కేంద్రానికి విన్నవించినప్పటికీ ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగడం లేదు. ఏకంగా నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వకపోవటం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో 2018–19 బడ్జెట్‌లోనైనా తెలంగాణకు తగినన్ని నిధులు వస్తాయనే ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది.
నీతి ఆయోగ్ సిఫారసులు అమలయ్యేనా?
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయించాలని ఇటీవలే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ అధికారుల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలసి విన్నవించింది. అలాగే 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను కలసి రాష్ట్రానికి నిధుల అవసరాన్ని ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకానికి రూ.19 వేల కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని నీతి ఆయోగ్ గతేడాదిలోనే కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు సాయమందించాలని సూచించింది. ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం ఇప్పటివరకు పట్టించుకోలేదు.
కాళేశ్వరానికి సాయమందేనా..
గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల సాయమందించాలని రాష్ట్రప్రభుత్వం ఇదివరకే కేంద్రాన్ని కోరింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీతో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు విడుదల చేసే నిధులు సైతం దాదాపు రూ.7 వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్ అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈసారి బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఈటల అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు గిరిజన, హార్టికల్చర్ యూనివర్సిటీలకు, కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌కు తగినన్ని నిధులు కేటాయిస్తుందో లేదో చూడాలి. బడ్జెట్‌లో తెలంగాణకు ఈ సారి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment