ts budjet
-
తెలంగాణలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్..?
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్నట్లు తెలిసింది. సభ ఎన్ని రోజులు జరగాలనేది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం తర్వాత నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రం కూడా అటు వైపే మొగ్గు చూపనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఈ సమావేశాల్లో భాగంగా పూర్తిస్థాయి బడ్జెట్ పెడతారా? ఓటాన్ అకౌంట్‌కు వెళతారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయన్న అంచనాలతోనే రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ఎయిడ్తో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) నిధుల కేటాయింపులను అంచనా వేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను పేర్కొంటూ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే కేంద్రం పెట్టిన ఓటాన్ అకౌంట్లో ప్రజలపై విధించే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు కానీ, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో విధాన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి దీంతో అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయన్న దానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అంచనాకు వచ్చే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ వైపే మొగ్గు చూపుతుందని అంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. తెలంగాణలో కూడా ఆరు నెలల కాలానికి గాను ఓటాన్ అకౌంట్ పెట్టి ఆ తర్వాత సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. -
బడ్జెట్‌పై కోటి ఆశలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సారైనా సరిపడేన్ని నిధులు కేటాయిస్తుందని అంచనాలు వేసుకుంటోంది. గడిచిన మూడేళ్లు రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో చెప్పుకోదగ్గ కేటాయింపులు లేకపోవటం తెలంగాణను నిరాశకు గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు తగినంత ఆర్థిక సాయం చేయాలని పదే పదే కేంద్రానికి విన్నవించినప్పటికీ ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగడం లేదు. ఏకంగా నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వకపోవటం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో 2018–19 బడ్జెట్లోనైనా తెలంగాణకు తగినన్ని నిధులు వస్తాయనే ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. నీతి ఆయోగ్ సిఫారసులు అమలయ్యేనా? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయించాలని ఇటీవలే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ అధికారుల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలసి విన్నవించింది. అలాగే 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను కలసి రాష్ట్రానికి నిధుల అవసరాన్ని ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకానికి రూ.19 వేల కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని నీతి ఆయోగ్ గతేడాదిలోనే కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు సాయమందించాలని సూచించింది. ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం ఇప్పటివరకు పట్టించుకోలేదు. కాళేశ్వరానికి సాయమందేనా.. గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల సాయమందించాలని రాష్ట్రప్రభుత్వం ఇదివరకే కేంద్రాన్ని కోరింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీతో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు విడుదల చేసే నిధులు సైతం దాదాపు రూ.7 వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈసారి బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఈటల అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు గిరిజన, హార్టికల్చర్ యూనివర్సిటీలకు, కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌కు తగినన్ని నిధులు కేటాయిస్తుందో లేదో చూడాలి. బడ్జెట్లో తెలంగాణకు ఈ సారి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. -
అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యమా?
హైదరాబాద్: తెలంగాణను అప్పుల రాష్ట్రం అని మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించటం తగదని చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పులు చేయలేదా? అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యమా? అని ప్రశ్నించారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఓ ఆకతాయిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదే టీఆర్ఎస్కు చివరి బడ్జెట్ అని రేవంత్ అనడం సిగ్గుచేటని తెలిపారు. టీడీపీని తెలంగాణ ప్రజలు ఎపుడో తిరస్కరించారని అన్నారు. ప్రజల దృష్టిలో పలుచనయ్యే మాటలు మాట్లాడొద్దని ఆయన హితవుపలికారు. బీసీల కోసం ప్రవేశ పెట్టిన పథకాలను కృష్ణయ్య తప్పు పట్టడం సమంజసం కాదన్నారు. విపక్షాలు నిజాలు గ్రహించి మాట్లాడితే మంచిదని అన్నారు. ఇది సుస్పష్టంగా పేదల అనుకూల బడ్జెట్ అని కొనియాడారు. వెనుకబడిన, అణగారిన వర్గాలకు కేటాయింపులు భారీగా పెరిగాయని తెలిపారు.ఇది బ్యాలట్ బాక్స్ బడ్జెట్ కాదు పేదలను ఉద్ధరించే బడ్జెట్ అని కొప్పుల చెప్పారు.