తెలంగాణ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్నట్లు తెలిసింది. సభ ఎన్ని రోజులు జరగాలనేది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం తర్వాత నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రం కూడా అటు వైపే మొగ్గు చూపనున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఈ సమావేశాల్లో భాగంగా పూర్తిస్థాయి బడ్జెట్ పెడతారా? ఓటాన్ అకౌంట్‌కు వెళతారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయన్న అంచనాలతోనే రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు.
కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్‌ఎయిడ్‌తో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు (సీఎస్‌ఎస్) నిధుల కేటాయింపులను అంచనా వేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను పేర్కొంటూ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే కేంద్రం పెట్టిన ఓటాన్ అకౌంట్‌లో ప్రజలపై విధించే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు కానీ, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో విధాన నిర్ణయాన్ని ప్రకటించలేదు.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
దీంతో అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయన్న దానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అంచనాకు వచ్చే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ వైపే మొగ్గు చూపుతుందని అంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. తెలంగాణలో కూడా ఆరు నెలల కాలానికి గాను ఓటాన్ అకౌంట్ పెట్టి ఆ తర్వాత సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment