న్యూఢిల్లీ: సామాన్యుడికి క్రిస్మస్ కానుక. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మధ్య తరగతి ప్రజలు విరివిగా వినియోగించే 23 వస్తువులు, సేవలపై పన్నును జీఎస్టీ మండలి తగ్గించింది. ధరలు తగ్గనున్న వాటిలో సినిమా టికెట్లు, టీవీ, కంప్యూటర్ తెరలు, పవర్ బ్యాంకులున్నాయి. శీతలీకరించిన, నిల్వ చేసిన కూరగాయలకు పూర్తి పన్ను మినహాయింపు ఇచ్చారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం జరిగిన జీఎస్టీ మండలి 31వ సమావేశంలో పలు వస్తువుల పన్ను రేట్లను హేతుబద్ధీకరిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం 18 శాతం పన్ను పరిధిలోని రూ.100 వరకున్న సినిమా టికెట్లను 12 శాతం శ్లాబులో చేర్చారు. రూ.100కు పైనున్న టికెట్లపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. మానిటర్లు, టీవీ తెరలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి కుదించారు. సవరించిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. పన్ను రేట్ల కోత వల్ల కేంద్ర ఖజానా ఏటా రూ.5,500 కోట్లు నష్టపోతుందని జైట్లీ వెల్లడించారు. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ నిరంతర ప్రక్రియ అని, 28 శాతం శ్లాబు క్రమంగా కుచించుకుపోతోందని అన్నారు. 99 శాతం వస్తువులపై పన్నును 18 శాతం లేదా అంతకన్నా తక్కువకే పరిమితం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో తాజా రేట్ల కోత ప్రాధాన్యం సంతరించుకుంది.
28 శాతం శ్లాబులో 28 వస్తువులే...
గరిష్ట పన్ను శాతం అయిన 28 శాతం శ్లాబులో ఉన్న ఏడు వస్తువులు, సేవలపై పన్నును కుదించడంతో, ఇక ఆ శ్లాబులో 28 వస్తువులు, సేవలే మిగిలాయి. ఆటో మొబైల్ పరికరాలు, సిమెంట్, మద్యం, సిగరెట్లు, ఇతర విలాసవంత వస్తువులు, సేవలే అందులో ఉన్నాయి. పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి కుదించిన వస్తువులు, సేవల జాబితాలో.. కప్పీలు(గిలక), ట్రాన్స్‌మిషన్ షాఫ్ట్(వాహనాల్లో క్లచ్, ఇంజిన్‌ను అనుసంధానించేది), పునర్వినియోగ టైర్లు, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్‌లు, వీడియో గేమ్ పరికరాలున్నాయి.
ఊతకర్ర, ఫ్లైయాష్ ఇటుకలపై 5 శాతం పన్ను..
దివ్యాంగుల ఉపకరణాలపై ప్రస్తుతం అమలవుతున్న పన్నును 28 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. సరకు రవాణా వాహనాల థర్డ్ పార్టీ బీమా ప్రీమియాన్ని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అత్యల్ప పన్ను శాతమైన 5 శాతం శ్లాబులో...ఊత కర్ర, ఫ్లైయాష్ ఇటుకలు, సహజ బెరడు, చలువరాళ్లను చేర్చారు. ఇతర దేశాల సహకారంతో ప్రభుత్వం సమకూర్చే నాన్–షెడ్యూల్డ్, చార్టర్డ్ విమానాల సేవలపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పునర్వినియోగ ఇంధన ఉపకరణాలు, వాటి తయారీపై కూడా 5 శాతం పన్ను విధించారు. శీతలీకరించిన, ప్యాక్ చేసిన కూరగాయలతో పాటు రసాయనాలతో భద్రపరచిన, తక్షణం తినడానికి సిద్ధంగా లేని కూరగాయలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. జన్‌ధన్ యోజన ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలను కూడా పన్ను పరిధి నుంచి తప్పించారు.
ప్రయోజనాలు వినియోగదారులకు అందాలి: జైట్లీ
నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ(పన్ను ప్రయోజనాలకు సంబంధించిన ఫిర్యాదుల్ని పరిష్కరించే సంస్థ) ఎంతో చురుగ్గా పనిచేస్తోందని, పన్ను కోత ప్రయోజనాల్ని వినియోగదారులకు బదిలీచేయాలని జైట్లీ వ్యాపారులకు స్పష్టం చేశారు. ఇప్పటి దాకా జీఎస్టీ చెల్లించని, రిటర్నులను దాఖలుచేయని వ్యాపారులు వచ్చే మార్చి 31 లోగా ఆ పనులు పూర్తి చేయాలని, లేని పక్షంలో జరిమానా తప్పదని హెచ్చరించారు. జీఎస్టీ పన్ను వర్తింపుపై రెండు రాష్ట్రాల అడ్వాన్స్ రూలింగ్ అథారిటీలు(ఏఏఆర్)లు ఇచ్చే భిన్న తీర్పుల్ని పరిశీలించేందుకు కేంద్రీకృత ఏఏఆర్‌ను ఏర్పాటుచేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. కాగా, జీఎస్టీ రేట్ల కోతను బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈ నిర్ణయంతో తమ ఆదాయానికి గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. పన్ను తగ్గింపు ద్వారా వాటిల్లే నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం ఐదేళ్లకు మించి పరిహారం చెల్లించాలని కేరళ డిమాండ్ చేసింది.
28% నుంచి 18%..
32 అంగుళాల వరకున్న టీవీ తెరలు, కంప్యూటర్, రూ.100కు పైనున్న సినిమా టికెట్లు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు, కప్పీ, ట్రాన్స్‌మిషన్ షాఫ్ట్‌లు, గేర్ బాక్సులు, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, వీడియో గేమ్ పరికరాలు, పునర్వినియోగ టైర్లు
28% నుంచి 5%..
దివ్యాంగులను మోసుకెళ్లే వాహనాల విడి భాగాలు
18% నుంచి 5%..
చలువ రాయి ముక్కలు
12% నుంచి 0%..
మ్యూజిక్ బుక్స్
5% నుంచి 0%..
శీతలీకరించిన, ప్యాకింగ్ చేసిన కూరగాయలు
18% నుంచి 12%..
రూ.100 లోపున్న సినిమా టికెట్లు, సహజ బెరడుతో తయారైన వస్తువులు తదితరాలు
12% నుంచి 5%..
సహజ బెరడు, ఊతకర్ర, ఫ్లైయాష్ ఇటుకలు
Comments
Please login to add a commentAdd a comment