ముంబై: ఐటీ కంపెనీల బోణీతో ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. టీసీఎల్, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ కార్పొరేషన్ వంటి ప్రధాన సంస్థల ఫలితాలకు తోడు.. పలు జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాలు ఈవారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుండగా.. ఎస్‌ఎంఈలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా జరిగిన 31వ సమావేశంలో పలు వస్తు, సేవలపై జీఎస్‌టీ రేటును కౌన్సిల్ తగ్గించిన నేపథ్యంలో ఈసారి సమావేశంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఇక శుక్రవారం వెలువడే పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు కన్నేసివుంచారు. వీటితో పాటు ముడిచమురు, రూపాయి కదలికలు మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయని భావిస్తున్నారు.
ఒడిదుడుకులకు అవకాశం..
‘కార్పొరేట్ ఫలితాల అంశం కారణంగా మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగేందుకు అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనుండగా.. ఇక్కడ నుంచి అందే సంకేతాలు, క్రూడ్ ధరల కదలికలు, రూపాయి మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి.’ అని ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. ‘ప్రీమియం వాల్యుయేషన్, దేశీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం.. పట్టణ, గ్రామీణ మార్కెట్లలో కొనసాగుతున్న ద్రవ్య లభ్యత కారణంగా వచ్చే త్రైమాసికాల్లో కంపెనీల ఆదాయంలో వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది.
ఇక సాధారణ ఎన్నికలు సమీస్తున్నాయి. ఈ అంశాలను బేరీజు వేసుకుని చూస్తే ఇంకొంతకాలం మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతాయని అంచనావేస్తున్నాం.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ సైతం ఒడిదుడుకులు కొనసాగేందుకే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సమాచారం అనంతరం ఇందుకు ఆస్కారం అధికంగా ఉండగా.. ఈ డేటా వెల్లడి తరువాత మార్కెట్‌కు ఒక దిశా నిర్దేశం కానుందన్నారు. దేశీ ఆర్థిక అంశాల్లో ఐఐపీ ఈవారంలో కీలకంగా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు.
అమెరికా–చైనాల చర్చ..
ఈనెల 7–8 తేదీల్లో ఇరు దేశాల ప్రతినిధులు బీజింగ్‌లో సమావేశంకానున్నారు. గతేడాదిలో చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులు పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య యుద్ధం మొదలుకాగా, ఆ తరువాత ఇరు దేశాలు రాజీ ధోరణి ప్రదర్శించినప్పటికీ.. ఏ క్షణంలో ఎటువంటి వార్తలు వెలువడుతాయో అనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే యూఎస్–చైనా ప్రతినిధుల చర్చ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈవారంలో మార్కెట్‌ను ప్రభావితం చేయదగిన అంతర్జాతీయ అంశాల్లో.. డిసెంబర్ అమెరికా పేరోల్ రిపోర్ట్, ఆ దేశం ద్రవ్యోల్బణం, తయారీయేతర పీఎంఐ డేటాలు ఉన్నాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.83,000 కోట్లు
గతేడాదిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీ మార్కెట్ నుంచి రూ.83,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. రూ.33,553 కోట్లను ఈక్విటీ మార్కెట్ నుంచి.. రూ.49,593 కోట్లను డెట్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. వడ్డీ రేట్ల పెంపు, క్రూడ్ ధరల పెరుగుదల, రూపాయి పతనంతో 2018లో ఈస్థాయి పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని ఫండ్స్‌ఇండియా డాట్ కామ్ మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ హెడ్ విద్యా బాల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment