పేదల వస్తువులపై పన్ను భారం ఉండొద్దు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయం: ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: పేదలు వాడే వస్తువులపై అధిక పన్ను భారం ఉండొద్దని దాదాపు అన్ని రాష్ట్రాలు అభిప్రాయం వ్యక్తం చేశాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 4వ సమావేశంలో ఈటల పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను వెల్లడించారు. రాష్ట్రాల ఆదాయాలు తగ్గకుండా ఉండే పద్ధతులు, నష్టపరిహారం అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాల్లో గతంలో 5 శాతం వ్యాట్ ఉన్న అన్ని వస్తువులపై జీఎస్టీలో యథాతథంగా 5 శాతం పన్నులు విధించాలని నిర్ణయించినట్లు చెప్పారు.9 నుంచి 15 శాతం మధ్య పన్ను ఉన్న వస్తువులపై 12 శాతం పన్నులు వసూలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదించిందన్నారు.
బంగారం, వజ్రాలు మినహా అన్ని వస్తువులపై పన్ను 5, 12, 18, 28 శాతాలుగా విధించడానికి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పారు. గతంలో 40 నుంచి 45 శాతం పన్ను ఉన్న వస్తువులపై జీఎస్టీ ద్వారా 28 శాతం పన్ను విధించాలని నిర్ణయించినందున రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని సమకూర్చేందుకు ఆ వస్తువులపై సెస్ విధించి నష్టాన్ని కొంత మేర భర్తీ చేయాలని నిర్ణయించారని చెప్పారు. పొగాకు సంబంధిత వస్తువులపై పన్ను శాతం తగ్గించాలని నిర్ణయించినందున వాటిపై కూడా సెస్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.