వస్తు, సేవల పన్ను (GST) కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ సమావేశంలో బీమా రంగం, ప్రభుత్వ ఖజానాపై విస్తృత ప్రభావాలను కలిగించే ఒక ముఖ్యమైన ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు ఆ ప్రధాన ప్రతిపాదన.దీని వల్ల ఏటా ప్రభుత్వ ఆదాయానికి రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.
“జీఎస్టీ నుంచి ఆరోగ్య బీమాను పూర్తిగా మినహాయిస్తే, నష్టం దాదాపు రూ. 3,500 కోట్లు. సెప్టెంబరు 9న జరిగే సమావేశంలో జీఎస్టీ నుండి ఆరోగ్య బీమా మినహాయింపును కౌన్సిల్ ఆమోదిస్తే భారీ ఆదాయ నష్టం కలిగిస్తుంది” అని ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ‘మనీకంట్రోల్’ పేర్కొంది.
కమిటీ సిఫార్సులే కీలకం
ప్రస్తుతం అన్ని రకాల ఆరోగ్య, జీవిత బీమా పాలసీలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఈ పన్ను నుండి ఆరోగ్య బీమాను మినహాయించాలనే ప్రతిపాదన రాష్ట్ర, కేంద్ర రెవెన్యూ అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ చర్చలో ఉంది. జీఎస్టీ రేట్లలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించి కౌన్సిల్‌కు సిఫార్సులు చేయడం కమిటీ బాధ్యత.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ మినహాయింపు ప్రభుత్వ రెవెన్యూపై ఎంత మేర ప్రభావాన్ని చూపుతుందన్నది ఫిట్‌మెంట్ కమిటీ విశ్లేషించి సిఫార్సులు చేస్తుంది. వీటిపైనే కౌన్సిల్ తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment