ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ, పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారు? | 48th GST Meet: what industry says Tax On Online Gaming 28pc GST | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ, పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారు?

Published Fri, Dec 9 2022 1:11 PM | Last Updated on Fri, Dec 9 2022 1:22 PM

48th GST Meet: what industry says Tax On Online Gaming 28pc GST - Sakshi

న్యూఢిల్లీ: నైపుణ్య ఆధారిత ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రస్తుత 18 శాతం నుండి 28 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన పట్ల తమకు అభ్యంతరం ఏదీ లేదని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ స్థాయి పన్ను స్థూల గేమింగ్‌ రాబడి (జీజీఆర్‌) పైనే విధించాలని,  పోటీకి సంబంధించిన ప్రవేశ మొత్తంపై (సీఈఏ) 28 శాతం జీఎస్‌టీ విధింపు సరికాదని పేర్కొంది. (వర్క్‌ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు)

ప్రవేశ మొత్తంపైనే ఈ స్థాయి పన్ను విధిస్తే, అది దాదాపు 2.2 బిలియన్‌ డాలర్ల విలువచేసే పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషించింది. జీజీఆర్‌ అనేది ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా  తమ ప్లాట్‌ఫారమ్‌లోని గేమ్‌లో పాల్గొనడానికి సర్వీస్‌ ఛార్జీలుగా ఆయా సంస్థలు వసూలు చేసే రుసుము. అయితే పోటీ ఎంట్రీ అమౌంట్‌ (సీఈఏ) అనేది ప్లాట్‌ఫారమ్‌పై పోటీలో పాల్గొనడానికి ప్లేయర్‌ డిపాజిట్‌ చేసిన మొత్తం. ఆయా అంశాలు, సమస్యలపై గేమింగ్‌ పరిశ్రమ నిపుణులు ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు.  (గుడ్‌న్యూస్‌: ఎఫ్‌ఎంసీజీపై తగ్గుతున్న ఒత్తిడి, దిగిరానున్న ధరలు!)

నేపథ్యం ఇదీ... 
ఆన్‌లైన్‌ గేమింగ్‌ జీజీఆర్‌పై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్‌టీని 28 శాతానికి పెంచడంపై డిసెంబర్‌ 17న జరుగుతుందన్న భావిస్తున్న జీఎస్‌టీ మండలి ఒక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో గేమింగ్‌ రంగంలో నిపుణులు కేంద్రానికి తమ కీలక సూచనలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  నేతృత్వంలోని జరగబోయే రానున్న జీఎస్‌టీ సమావేశంలో ప్యానెల్‌ క్యాసినో, రేస్‌ కోర్స్‌  ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమకు సంబంధించిన ఎజెండాను చేపట్టవచ్చని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్‌లో జరిగిన 47వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం క్యాసినో, రేస్‌ కోర్స్, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై నివేదిక సమర్పించాలని మంత్రుల బృందాన్ని ఆదేశించింది. నివేదిక రూపకల్పన విషయంలో ఈ రంగానికి సంబంధించి పలు అంశాల పరిశీలనతో పాటు రాష్ట్రాల నుండి వచ్చే మరిన్ని సూచనలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.    (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?)

గేమ్స్‌ ఇవీ... 
నైపుణ్యాల ప్రాతిపదికన జరిగే ఆన్‌లైన్‌ గేమ్‌లలో ఇ–స్పోర్ట్స్, ఫాంటసీ గేమ్‌లు, రమ్మీ, పోకర్‌ లేదా చెస్‌ ఉన్నాయి. ఇటువంటి గేమ్‌లు ఆన్‌లైన్‌లో ఉచితంగానూ ఆడవచ్చు. లేదా ఫ్లాట్‌ఫామ్‌ ఫీజుల రూపంలో డబ్బు చెల్లించి ఆడే వారూ ఉంటారు. 

చట్టబద్ద పరిశ్రమ ప్రయోజనాలు కాపాడాలి 
పోటీ ప్రవేశ మొత్తంపై కాకుండా స్థూల గేమింగ్‌ ఆదాయంపై జీఎస్‌టీ విధించాలని ఒకే పరిశ్రమగా ఒకే తాటిపై మేము కోరుతున్నాము. స్థూల గేమింగ్‌ ఆదాయంపై జీఎస్‌టీ 18 శాతం నుండి 28 శాతానికి పెరగడం వలన కేంద్రానికి పన్ను రాబడి పెరుగుతుంది. పరిశ్రమ కూడా దీనిని భరించగలుగుతుంది. ఇక పోటీ ప్రవేశ మొత్తంపై పన్ను విధించడం వల్ల పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. పెరిగిన పన్ను భారాన్ని వినియోగదారులపై మోపవలసి ఉంటుంది. దీనివల్ల భారతదేశంలో ఎటువంటి పన్ను బాధ్యతలు లేని గ్రే మార్కెట్, ఆఫ్‌షోర్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లకు ఆటగాళ్లు మారిపోతారు. దీనితో చట్టబద్ధమైన గేమింగ్‌ వ్యాపార సంస్థలు తమ కస్టమర్‌ బేస్‌ను కోల్పోతాయి. చివరకు చట్టబద్దమైన సంస్థలపై, ప్రభుత్వ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తుంది- త్రివిక్రమన్‌ థంపి,  గేమ్స్‌ 24గీ7 కో–చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ 

ప్రతికూల ప్రభావాలు 
ఎంట్రీ ఫీజుల కంటే స్థూల గేమింగ్‌ రాబడిపై పరిశ్రమ జీఎస్‌టీ విధించడం వల్ల ఫలితాలు బాగుంటాయి. ఎంట్రీ ఫీజుపై పన్ను విధింపు మాత్రం భారత్‌దేశంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న గేమింగ్‌ రంగం వృద్ధిని నియంత్రిస్తుంది. ప్రవేశ రుసుములపై జీఎస్‌టీని వర్తింపజేయడం వలన ఇప్పటికే అనేక రకాల పన్నులు– రుసుములను చెల్లించే ప్లేయర్లు తీవ్రంగా నిరుత్సాహపడతారు.  స్థూల గేమింగ్‌ రాబడిపై పన్ను విధించడం వలన ప్లేయర్లు వారి నైపుణ్యం లేదా విజయంతో సంబంధం లేకుండా, న్యాయమైన సమానమైన మార్గంలో పన్ను చెల్లింపులకు సహకరిస్తారు. ఎంట్రీ ఫీజుపై జీఎస్‌టీ విధింపు వల్ల కంపెనీలు లేదా ప్లేయర్లు చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్‌ జూదం యాప్‌ల వైపు నడిచే అవకాశం ఉంది. ఇవి భారత్‌ చట్టాలకు అనుగుణంగాగానీ లేదా ఎకానమీకి లాభదాకంగా ఉండే అవకాశమే ఉండదు -సుమంత డే, డిజిటల్‌ వర్క్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement