సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కింద రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునే పరిమితిని 4 నుంచి 5 శాతానికి పెంచాలని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్ అమలవుతోందని, దీని కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నేతృత్వంలో జరిగిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్ 44వ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సచివాలయం నుంచి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.సోమేశ్‌కుమార్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, ఒక్క మే నెలలోనే తెలంగాణ రూ.4,100 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని హరీశ్‌రావు చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచితే రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
త్వరగా వ్యాక్సిన్ ఇవ్వండి
కోవిడ్ థర్డ్‌వేవ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం వీలున్నంత త్వరగా ఉచిత వ్యాక్సినేషన్‌ను చేపట్టాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని, రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునైనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్‌సహా ఇతర వైద్య సామగ్రిపై జీఎస్టీ విధింపు విషయంలో మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు హరీశ్ మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment