సాక్షి,న్యూఢిల్లీ: సంవత్సరాంతంలో ఆర్‌బీఐ తీపికబురు అందించనుంది. డిసెంబర్ 6న జరిగే ద్రవ్య సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చని భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.3 శాతానికి తగ్గడంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉంది. అదే జరిగితే వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం కొంత మేర దిగివస్తుంది. డిసెంబర్‌లో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల సమీక్ష సందర్భంగా పావు శాతం కోత ఉంటుందని తాము అంచనా వేస్తున్నామని, రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 3.3 శాతానికి తగ్గడం ఈ దిశగా ఆర్‌బీఐకి సానుకూలాంశమని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ (బీఓఎఫ్‌ఏఎంల్) నివేదిక పేర్కొంది. ఈ నెలలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే.
వరుసగా ఆగస్ట్, సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.3 శాతంగా ఉండటం, టొమాటో, ఉల్లి ధరలు తగ్గడంతో పాటు ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో రిటైల్ ద్రవ్యోల‍్బణం అక్టోబర్‌లో సైతం అదుపులో ఉండే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. దీంతో ఆర్‌బీఐ తన తదుపరి ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా డిసెంబర్‌లో వడ్డీ రేట్లను పావు శాతం మేర తగ్గిస్తుందని అంచనా వేస్తున్నామని బీఓఎఫ్‌ఏఎంల్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయిలో 5.7 శాతానికి పతనమైన నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment