
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో మరింతగా క్షీణించి 4.5%కి పరిమితం అయిన నేపథ్యంలో.. ఆర్‌బీఐ ఎంపీసీ మరో విడత పావు శాతం వరకు కీలక రేట్ల తగ్గింపును చేపట్టొచ్చనేది నిపుణుల అంచనా. శక్తికాంతదాస్ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్‌బీఐ ఇప్పటిదాకా ప్రతీ భేటీలోనూ రేట్లను తగ్గిస్తూనే వచ్చింది. ఇప్పటి వరకు గత ఏడాది కాలంలో 135 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దేశ వృద్ధి రేటును ప్రగతి బాట పట్టించేందుకు తాము మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు కూడా.
అయితే, ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం ఆర్‌బీఐ రేట్ల కోతకు సాయపడింది. మరి తాజాగా ద్రవ్యోల్బణం ఎగువవైపు పరుగును ఆరంభించింది. అక్టోబర్‌లో ఆర్‌బీఐ లకి‡్ష్యత స్థాయి (4.5%)ని దాటుకుని 4.6%కి చేరింది. దీంతో మరో విడత రేట్లపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, అక్టోబర్‌లో రేట్ల కోత సమయంలో సర్దుబాటు ధోరణిని ఆర్‌బీఐ కొనసాగించినందున, ఆర్థిక పరిస్థితులు ఇలానే బలహీనంగా ఉంటే మరో విడత రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ముఖ్య ఆర్థికవేత్త రాజీవ్ బిశ్వాస్ తెలిపారు. ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ ఈ నెల 3న ప్రారంభం కానుంది. 5న విధాన ప్రకటనపై నిర్ణయం వెలువడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment