బీజింగ్: ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వడ్డీరేట్ల పెంపు బాట పడితే, చైనా ఇందుకు భిన్నమైన వైఖరిని అవలంభిస్తోంది. ఎకానమీకి ఊపును అందించడానికి కీలక రుణ రేటు తగ్గిస్తూ చైనా సెంట్రల్ బ్యాంక్ సోమవారం నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన అధికారాన్ని పటిష్టం చేసుకోడానికి ప్రయత్నిస్తున్న ప్రస్తుత రాజకీయంగా సున్నిత సమయంలో సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా మరో ఐదేళ్లపాటు బాధ్యతల్లో కొనసాగడానికి వరుసగా మూడవసారి జి జిన్‌పింగ్ పావులు కదుపుతారన్న అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దేశ ఎకానమీ మందగమన పరిస్థితిలో ఉండరాదని ఆయన కోరుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఏడాది రుణ రేటును 2.85 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. దీనికితోడు రుణ మార్కెట్లలోకి 400 బిలియన్ చైనా యువాన్లను (60 బిలియన్ డాలర్లు) పంపుతున్నట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం రుణ వ్యయాలు భారీగా పెరిగాయి. వైరస్ సంబంధ ఆంక్షలు, వాణిజ్య అడ్డంకులు, తయారీ–వినియోగంలో తగ్గిన వ్యయాలు, రియల్టీ రంగంలో సవాళ్లు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటోంది. ఫ్యాక్టరీ, రిటైల్ అమ్మకాలు జూలైలో బలహీనంగా ఉన్నాయి. గృహ విక్రయాలు భారీగా పడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment