China central bank
-
వడ్డీరేట్ల విషయంలో ట్రెండ్‌కు భిన్నంగా చైనా
బీజింగ్: ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వడ్డీరేట్ల పెంపు బాట పడితే, చైనా ఇందుకు భిన్నమైన వైఖరిని అవలంభిస్తోంది. ఎకానమీకి ఊపును అందించడానికి కీలక రుణ రేటు తగ్గిస్తూ చైనా సెంట్రల్ బ్యాంక్ సోమవారం నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన అధికారాన్ని పటిష్టం చేసుకోడానికి ప్రయత్నిస్తున్న ప్రస్తుత రాజకీయంగా సున్నిత సమయంలో సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా మరో ఐదేళ్లపాటు బాధ్యతల్లో కొనసాగడానికి వరుసగా మూడవసారి జి జిన్‌పింగ్ పావులు కదుపుతారన్న అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ ఎకానమీ మందగమన పరిస్థితిలో ఉండరాదని ఆయన కోరుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఏడాది రుణ రేటును 2.85 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. దీనికితోడు రుణ మార్కెట్లలోకి 400 బిలియన్ చైనా యువాన్లను (60 బిలియన్ డాలర్లు) పంపుతున్నట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం రుణ వ్యయాలు భారీగా పెరిగాయి. వైరస్ సంబంధ ఆంక్షలు, వాణిజ్య అడ్డంకులు, తయారీ–వినియోగంలో తగ్గిన వ్యయాలు, రియల్టీ రంగంలో సవాళ్లు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటోంది. ఫ్యాక్టరీ, రిటైల్ అమ్మకాలు జూలైలో బలహీనంగా ఉన్నాయి. గృహ విక్రయాలు భారీగా పడిపోయాయి. -
అలీబాబాను ఆదుకోని బైబ్యాక్ ప్లాన్
హాంకాంగ్, షాంఘై: ఇటీవల పతన బాటలో సాగుతున్న చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. సోమవారం మరోసారి ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో హాంకాంగ్‌లో లిస్టయిన అలీబాబా షేరు 9 శాతం పతనమైంది. తద్వారా జూన్ తదుపరి కనిష్టానికి చేరింది. గత రెండు రోజుల్లో షేరు భారీగా తిరోగమించడంతో కంపెనీ మార్కెట్ విలువలో 116 బిలియన్ డాలర్లమేర ఆవిరైనట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. యూఎస్‌లోనూ షేరు ఇంట్రాడేలో 15 శాతం వరకూ పతనంకావడం గమనార్హం! నిజానికి కంపెనీ 10 బిలియన్ డాలర్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించింది. అయినప్పటికీ చైనీస్ నియంత్రణ సంస్థలు కంపెనీ ఆధిపత్య ధోరణిపై దర్యాప్తు చేపట్టనుండటంతో ఈ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. (యాంట్ గ్రూప్ ఐపీవోకు చైనీస్ షాక్) దర్యాప్తు ఎఫెక్ట్ అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మాతోపాటు.. అతని ఫైనాన్షియల్ సామ్రాజ్యంపై ఇటీవల కొద్ది రోజులుగా చైనీస్ అధికారులు కన్నెర్ర చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అలీబాబాపై గుత్తాధిపత్య నిబంధనలకింద చైనీస్ నియంత్రణ సంస్థలు దర్యాప్తునకు ఆదేశించాయి. యాంట్ గ్రూప్, అనుబంధ సంస్థలపైనా దర్యాప్తునకు శ్రీకారం చుట్టాయి. యాంటీట్రస్ట్ చట్ట ప్రకారం అలీబాబా గ్రూప్‌పై భారీ స్థాయిలో జరిమానాలు విధించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. కాగా.. తొలుత ప్రతిపాదించిన 6 బిలియన్ డాలర్ల బైబ్యాక్‌ను 10 బిలియన్ డాలర్లకు పెంచేందుకు అలీబాబా బోర్డు నిర్ణయించింది. 2022వరకూ బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. అయినప్పటికీ సోమవారం షేరు 222 డాలర్ల వద్ద ముగిసింది. (యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్) కేంద్ర బ్యాంకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వారాంతాన యాంట్ గ్రూప్‌నకు చెందిన రుణ వ్యాపారం, కన్జూమర్ ఫైనాన్స్ వివరాలపై ఆరా తీసింది. ఇప్పటికే అంటే గత నెలలో 37 బిలియన్ డాలర్ల విలువైన యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూని చైనా నియంత్రణ సంస్థలు నిషేధించాయి. తద్వారా హాంకాంగ్, షాంఘైలలో లిస్టింగ్ చేపట్టేందుకు యాంట్ గ్రూప్ చేసుకున్న సన్నాహాలకు సరిగ్గా రెండు రోజుల ముందు చెక్ పెట్టాయి. కొద్ది రోజుల క్రితం జాక్ మా ఒక ఇంటర్వ్యూలో చైనీస్ బ్యాంకింగ్ వ్యవస్థ, రుణ నిబంధనలు తదితర అంశాలపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో నియంత్రణ సంస్థలు కన్నెర్ర చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు టెన్సెంట్ తదితర టెక్ దిగ్గజాలకు సైతం సమస్యలు సృష్టించవచ్చని ఈ సందర్భంగా విశ్లేషకులు చెబుతున్నారు. -
హెచ్‌డీఎఫ్‌సీలో చైనా బ్యాంక్ వాటాలు పెంపు
సాక్షి, ముంబై : భారత్‌కు చెందిన హెచ్డీఎఫ్సీ సంస్థలో చైనా సెంట్రల్ బ్యాంక్ తన వాటాలు పెంచుకుంది. 0.8 శాతం నుంచి 1.01 శాతానికి పెంచినట్లు బ్యాంకు వెల్లడించింది. హెచ్డీఎఫ్సీ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన త్రైమాసిక గణాంకాల ప్రకారం, మార్చి చివరి నాటికి చైనా సెంట్రల్ బ్యాంక్ 17.5 మిలియన్ షేర్లను కలిగి ఉంది. దీంతో సోమవారం హెచ్డీఎఫ్సీ షేరు 3.5 శాతం ఎగిసింది. మార్కెట్ల బలహీనత నేపథ్యంలో ప్రస్తుతం 1.7 శాతం నష్టంతో కొనసాగుతోంది. మార్చి త్రైమాసికానికి గాను షేర్ల వివరాల ప్రకారం, దేశంలో అతిపెద్ద గృహ తనఖా రుణదాత అయిన హెచ్‌డీఎఫ్‌సీలో(హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్)లో సెంట్రల్ బ్యాంక్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ) చైనా సావరిన్ వెల్త్ ఫండ్ సేఫ్ తరపున దాదాపు 1.75 కోట్ల వాటాలను కొనుగోలు చేసింది. కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పలు కంపెనీలు భారీగా క్షీణించడంతో చైనాకు చెందిన సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండడం విశేషం. కాగా కరోనావైరస్ మహమ్మారి , ఆర్ధిక పతనం ఆందోళనలతో మార్చిలో హెచ్డీఎఫ్సీ షేరు విలువ 25 శాతానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. (మరింత బలహీనపడిన రూపాయి) (కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు) -
వడ్డీ రేట్లు తగ్గించిన చైనా
చైనా: చైనా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్యనిధి నిల్వ శాతం అరశాతం మేర తగ్గించినట్టు వెల్లడించింది. గత 10 నెలల్లో ఐదుసార్లు వడ్డీ రేట్లు తగ్గించిన చైనా.. రూరల్ కమర్షియల్ బ్యాంకులకు మరో 50బీపీఎస్ పాయింట్ల వడ్డీ తగ్గించినట్టు పేర్కొంది. మార్కెట్లు నష్టాలనుంచి కోలుకోవడానికీ, చైనా ఆర్థిక వ్యవస్థ మెరుగుకోసమే వడ్డీ రేట్లను తగ్గించినట్టు సమాచారం. -
ప్రపంచ మార్కెట్లకు భారీ నష్టాలు
గ్రీసు సంక్షోభం దెబ్బకు ఆసియా, యూరప్, అమెరికా, అన్ని దేశాల మార్కెట్లు నేలచూపులే చూశాయి. చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లను పావు శాతం తగ్గించినప్పటికీ, ఆ దేశపు స్టాక్ మార్కెట్ సూచీ షాంగై కాంపోజిట్ 138 పాయింట్లు(3.4 శాతం) నష్టపోయి 4,035 పాయింట్ల వద్ద ముగిసింది. జపాన్‌కు చెందిన నికాయ్ 596 పాయింట్లు(3 శాతం) పడిపోయి 20,110 వద్ద ముగిసింది. హాంగ్‌సెంగ్ 697 పాయింట్లు(2.6 శాతం) క్షీణించి 25,967 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక యూరప్ మార్కెట్లు భారీ నష్టాలనే చవి చూశాయి. జర్మనీకి చెందిన డ్యాక్స్ 409 పాయింట్లు(3.6 శాతం) నష్టపోయి 11,083 పాయింట్లకు దిగజారింది. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 40 సూచీ 189 పాయింట్లు(3.8 శాతం) కోల్పోయి4,870కు పడిపోయింది. ఇంగ్లాండ్‌కు చెందినఎఫ్టీఎస్ఈ 100 సూచీ 133 పాయింట్లు(2 శాతం) క్షీణించి 6,620 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నాస్డాక్ 72 పాయింట్లు(1.4 శాతం) క్షీణించి 5,008 పాయింట్ల వద్ద, డోజోన్స్ 242 పాయింట్లు (1.3 శాతం) కోల్పోయి 17,704 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ పతనం మరింత కొనసాగుతుందని నిపుణులంటున్నారు.