ధరలు తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలకు రుణాల వృద్ధి కోసమే రేట్లను పావుశాతం మేర తగ్గించామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఎంపీసీ విధాన ప్రకటన తర్వాత మీడియాతో పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అంచనాల పరిధిలోనే తక్కువగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్‌బీఐ చట్ట నిబంధనల పరిధిని మించి ఎంపీసీ ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ‘‘వచ్చే 12 నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.9 శాతం పరిధిలో... గరిష్టంగా 4 శాతం లేదా అంతకులోపు ఉంటే రేట్ల తగ్గింపును పరిశీలించే అవకాశం ఉంటుంది’’అని దాస్ పేర్కొన్నారు. బడ్జెట్‌లో ప్రతిపాదనల వల్ల ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త ద్రవ్యోల్బణం అంచనాలకు వచ్చినట్టు చెప్పారు.
లిక్విడిటీ సమస్య లేదు
వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కీలకమైన ఏ రంగానికీ నిధుల లభ్యత (లిక్విడిటీ) సమస్య లేదని శక్తికాంతదాస్ తెలిపారు. అవసరమైనప్పుడు తగినన్ని నిధులను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా వ్యవస్థలోకి రూ.2.36 లక్షల కోట్లను తీసుకొచ్చామని, ఫిబ్రవరి నెలలో రూ.37,500 కోట్లను తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని విరాళ్ ఆచార్య గుర్తు చేశారు.
ఎన్‌పీఏ నిబంధనల్లో మార్పుల్లేవు
రుణ చెల్లింపుల్లో ఒక్కరోజు విఫలమైనా ఎన్‌పీఏలుగా గుర్తించాలన్న 2018 ఫిబ్రవరి 12 నాటి ఉత్తర్వుల్లో ఎటువంటి మార్పులను చేయడం లేదని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనా లేదన్నారు. నాటి ఉత్తర్వుల మేరకు బ్యాంకులు నిర్ణీత గడువులోపు రుణ చెల్లింపులు చేయని ఖాతాల విషయంలో నిర్ణీత వ్యవధిలోపు పరిష్కారం చూడడం, విఫలమైతే ఐబీసీ చట్టం కింద ఎన్‌సీఎల్‌టీకి నివేదించడం చేయాల్సి ఉంటుంది.
మధ్యంతర డివిడెండ్... న్యాయబద్ధమే
ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ను కోరడం చట్టబద్ధమేనని, ఈ నిధులను దేనికి వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమేనని దాస్ చెప్పారు. ఆర్‌బీఐ నుంచి మరిన్ని నిధులను బదిలీ చేయాలన్న ప్రభుత్వ డిమాండ్లతోనే ఉర్జిత్ పటేల్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘‘మిగులు నిధులు లేదా మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించడం అన్నది ఆర్‌బీఐ చట్టం పరిధిలోనిదే. ఈ చట్టపరమైన నిబంధనలను దాటి మేమేమీ చేయడం లేదు’’ అని దాస్ స్పష్టం చేశారు.
చందాకొచర్‌పై నిర్ణయం దర్యాప్తు సంస్థలదే...
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్ వ్యవహారంలో దాస్ తొలిసారి స్పందించారు. ఈ కేసులో చర్యలు తీసుకోవడం దర్యాప్తు సంస్థల పరిధిలోనే ఉందన్నారు. నిబంధనలను వ్యక్తులు లేదా గ్రూపు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే విషయంలో ఆర్‌బీఐ పాత్ర పరిమితమేనన్నారు. ఒకవేళ ఏదైనా అంశాల్లో దర్యాప్తు అవసరం అయితే తదుపరి చర్యల అధికారం వారి పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
సాగు రంగానికి వెసులుబాటు
హామీల్లేకుండా వ్యవసాయానికి ఇచ్చే రుణాల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచుతూ ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగానికి రుణాల పరిస్థితిని సమీక్షించి ఆచరణాత్మక విధానాన్ని సూచించేందుకు ఓ అంతర్గత వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయనుంది. గత కొన్నేళ్లలో వ్యవసాయ రంగానికి రుణాల పంపిణీ వృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ... ఈ రుణాల పంపిణీ విషయంలో ప్రాంతాల మధ్య అంతరాలు, కవరేజీ విస్తృతి వంటి సమస్యలు ఉన్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. ఈ అంశాలను ఆర్‌బీఐ వర్కింగ్ గ్రూపు పరిగణనలోకి తీసుకోనుంది.
డిపాజిట్లకు నిర్వచనంలో మార్పు
బ్యాంకులకు డిపాజిట్ల సమీకరణ విషయంలో ఆర్‌బీఐ కొంత స్వేచ్ఛ కల్పించింది. ప్రస్తుతం రూ.కోటి ఆపై మొత్తాలను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటే, దీన్ని రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువకు మార్చింది. బ్యాంకులు చిన్న డిపాజిట్ల కంటే బల్క్ డిపాజిట్లపై కొంత మేర అదనపు వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. బ్యాంకులు తమ అవసరాలు, ఆస్తులు, అప్పుల నిర్వహణ సమతుల్యత కోసం బల్క్ డిపాజిట్లపై భిన్నమైన రేటును ఆఫర్ చేసే స్వేచ్ఛ వాటికి ఉంటుంది. అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఏర్పాటుకు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.
దివాలా ప్రక్రియలో పాల్గొనే బిడ్డర్లకు ఈసీబీ సదుపాయం
దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) పరిధిలోని కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)లో పాల్గొనే కంపెనీలు ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ) మార్గంలో నిధుల సమీకరణకు ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ కరెన్సీ లేదా రూపాయి మారకంలో ఈసీబీ ద్వారా సమీకరించే నిధులను తిరిగి చెల్లింపులు లేదా రూపాయి మారకంలోని రుణాలను తీర్చివేసేందుకు అనుమతి లేదు.
మరో రేటు కోత అంచనా!
తాజా రేటు తగ్గింపు వృద్ధికి దోహదపడే అంశమని పలు వర్గాలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనితోపాటు త్వరలో మరో దఫా రేటు కోత తథ్యమని మెజారిటీ విశ్వసిస్తోంది. తాజా పాలసీపై పలువురి అభిప్రాయాలు ఇలా...
తటస్థ వైఖరి... సానుకూలం
పాలసీపై ‘తటస్థం’ దిశగా ఆర్‌బీఐ అడుగులు వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి తగిన సానుకూలతను సృష్టిస్తోంది. ధరలు పెరక్కపోతే మరో కోతకు చాన్సుంది.
– అభీక్ బారువా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
రెండు కీలక నిర్ణయాలు
ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలతో రైతులకు మరింత రుణం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల రైతుల రుణ సమస్యలు కొంత తీరుతాయి. ఇక వ్యవస్థలో మొత్తంగా రుణ డిమాండ్ పెరుగుతుంది.
– దినేష్ ఖేరా, ఎస్‌బీఐ ఎండీ
వేచి చూడాల్సి ఉంది
వృద్ధికి తాజా పాలసీ కొంత అవకాశం కల్పించింది. అయితే పూర్తి ఫలితానికి వేచి చూడాల్సి ఉంటుంది. ద్రవ్యలోటుసహా పలు అంశాలపై వృద్ధి జోరు ఆధారపడి ఉంటుంది.
– ప్రజుల్ భండారీ, హెచ్‌ఎస్‌బీసీ (ఇండియా) చీఫ్ ఎకనమిస్ట్
మరింత తగ్గింపు ఉండవచ్చు
ఆర్‌బీఐ నిర్ణయం హర్షణీయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న ప్రస్తుత తరుణంలో రేటు తగ్గింపు మరో విడత ఉండవచ్చని భావిస్తున్నాం. పెట్టుబడులు, వినియోగం పెరుగుదలకు ఇది అవసరం.
– సందీప్ సోమానీ, ఫిక్కీ ప్రెసిడెంట్
ఏప్రిల్‌లో మరో కోత
ఏప్రిల్‌లో మరో దఫా రేటు కోత ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, పారిశ్రామిక వృద్ధి మందగమనం దీనికి కారణం. ఆర్‌బీఐ నిర్ణయాలు వ్యవస్థలో లిక్విడిటీని పెంచుతున్నాయి.
– రాధికారావు, డీబీఎస్ ఎకనమిస్ట్
బ్యాంకింగ్ రంగానికి సానుకూలం
శక్తికాంతదాస్ మొదటి పాలసీ బ్యాంకింగ్‌పై పెద్ద స్థాయిలో సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యవస్థలో రుణ వృద్ధికి అలాగే మొత్తంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడే నిర్ణయం ఇది.
– సునిల్ మెహతా, ఐబీఏ చైర్మన్
కుదిరితే మరిన్ని కోతలు
Published Fri, Feb 8 2019 5:50 AM | Last Updated on Fri, Feb 8 2019 5:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment