
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నుంచి కాకుండా.. బహిరంగ మార్కెట్ నుంచి ఓపెన్ యాక్సెస్ విధానంలో నేరుగా విద్యుత్ కొనుగోలు చేస్తున్న వినియోగదారులపై అదనపు సర్‌చార్జీల మోత మోగనుంది. డిస్కంల కన్నా తక్కువ ధరకే విద్యుత్ విక్రయించే విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొన్ని భారీ పరిశ్రమలు నేరుగా ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల నుంచి రూ.372.51 కోట్ల అదనపు సర్‌చార్జీల వసూలు చేసేందుకు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించాయి.
ఓపెన్ యాక్సెస్‌లో కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్‌పై ...తొలి అర్ధవార్షికం లో రూ.2.01, రెండో అర్ధవార్షికంలో రూ.2.34 చొప్పున అదనపు సర్‌చార్జీలు వసూలు చేసుకోవడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరాయి. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 23 వరకు అభ్యంతరాలు పంపించాలని ఈఆర్సీ కోరింది. డిసెంబర్ 7న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ నిర్వహించి ఏ మేరకు అదనపు సర్‌చార్జీలు వసూలు చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.
బయటి కొనుగోళ్లతో మిగిలిపోతున్న విద్యుత్
దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా డిస్కంలకు 2021–22 తొలి అర్ధభాగంలో 8,210.18 మెగావాట్లు, రెండో అర్ధభాగంలో 8,574.88 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉండనుంది. ఓపెన్ యాక్సెస్ వల్ల తొలి అర్ధభాగంలో 171.89 మె.వా, రెండోఅర్ధభాగంలో 219.76 మె.వా. విద్యుత్‌ను డిస్కంలు విక్రయించుకోలేకపోయాయి. ఈ విద్యుత్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీల నష్టాలు కలిపి ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల నుంచి రూ.372.51 కోట్ల అదనపు సర్ చార్జీలను వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి.
ఎందుకు ఇలా?
రాష్ట్రంలోని వినియోగదారులందరి అవసరాలకు సరిపడ విద్యుత్ కోసం విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో డిస్కంలు పీపీఏలు కుదుర్చుకుంటాయి. ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లను వినియోగించి ఈ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీలు చెల్లిస్తాయి. వినియోగదారుల నుంచి వసూలు చేసే బిల్లుల ద్వారా ఈ ఖర్చులను డిస్కంలు తిరిగి వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం మేరకు విద్యుత్ కొనుగోలు చేయకపోయినా, విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు.. కొనుగోలు చేయని విద్యుత్‌కు సంబంధించిన స్థిర చార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అదే తరహాలో ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీలు చెల్లించక తప్పదు. కొంతమంది వినియోగదారులు నేరుగా బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుండడంతో, ఆ మేరకు ఫిక్స్‌డ్ చార్జీలు, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీల భారం డిస్కంలపై పడుతోంది. ఈ నేపథ్యంలోనే సదరు నష్టాలను అదనపు సర్‌చా ర్జీల రూపంలో, అందుకు కారణమైన వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేస్తున్నాయి.