హెచ్‌టీ కేటగిరీ చార్జీల పెంపునకు వారంలో ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదనలు !
11 కేవీ కనెక్షన్ల చార్జీలకు సమానంగా 33కేవీ, 132కేవీ/ఆపై కనెక్షన్ల చార్జీల పెంపునకు నిర్ణయం
33 కేవీ కనెక్షన్లకు యూనిట్‌కు అర్థరూపాయి, 132/ఆపై కనెక్షన్లకు యూనిట్‌కు రూపాయి వరకు పెరిగే అవకాశం
గృహాలు, వాణిజ్యంతో సహా ఎల్టీ కేటగిరీ పరిధిలోకి వచ్చే అన్ని కనెక్షన్లకు పెంపు లేనట్టే
డిస్కంల ప్రతిపాదనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత
సాక్షి, హైదరాబాద్: త్వరలో రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. హెచ్‌టీ కేటగిరీలో 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యం .అనే మూడు ఉప కేటగిరీల విద్యుత్ కనెక్షన్లుండగా, మూడింటికి వేర్వేరు చార్జీలు విధిస్తున్నారు. ఇకపై 33 కేవీ, 132కేవీ/ఆపై సామర్థ్యం కనెక్షన్ల చార్జీలను 11 కేవీ కనెక్షన్ల చార్జీలకు సమానంగా పెంచేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించగా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్టు సమాచారం.
కొన్ని హెచ్‌టీ కేటగిరీల్లోని 33 కేవీ కనెక్షన్లకు యూనిట్ విద్యుత్‌పై అర్ధరూపాయి వరకు, 132 కేవీ/ఆపై సామర్థ్యం కలిగిన కనెక్షన్లకు రూపాయి వరకు విద్యుత్ చార్జీలు పెరగనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎనీ్పడీసీఎల్) సంస్థలు వారంలోగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)ను.. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించే అవకాశముంది.
నవంబర్‌లోనే సమర్పించాల్సి ఉండగా...
విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్, ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను డిస్కంలు సిద్ధం చేయగా, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అప్పట్లో గడువు పొడిగింపు పొందాయి.
ఉత్తర/దక్షిణ డిస్కంలు గత ఆర్థిక సంవత్సరం 2023–24లో రూ.6299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, వాటి మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, మరో రూ.17,756 కోట్ల నష్టాల్లో టీజీఎన్పిడీసీఎల్ సంస్థ ఉంది. దీంతో చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారులు అంటున్నారు.
గృహాలు, వాణిజ్య కేటగిరీలకు పెంపు లేదు
లోటెన్షన్ కేటగిరీ పరిధిలోకి వచ్చే గృహాలు, గృహేతర/వాణిజ్య, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాలు, సాధారణ వినియోగదారుల విద్యుత్ చార్జీలు పెరగవు.
హెచ్‌టీలో చార్జీల మోత..
హెచ్‌టీ కేటగిరీలోని సాధారణ పరిశ్రమలు, లైట్స్ అండ్ ఫ్యాన్స్, కోళ్ల ఫారాలు, సీజనల్ పరిశ్రమలు, ఫెర్రో అల్లయ్ యూనిట్లు, ఇతరులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, తాత్కాలిక సరఫరా వంటి వినియోగదారులు వస్తారు. ఈ కేటగిరీల వినియోగదారులు తమ అవసరాల మేరకు 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యంతో విద్యుత్ కనెక్షన్లను కలిగి ఉన్నారు. 11 కేవీ కనెక్షన్‌తో సమానంగా సంబంధిత 33 కేవీ, 132 కేవీ/ఆపై కనెక్షన్ల చార్జీలను పెంచే అవకాశముంది.
11 కేవీ కనెక్షన్ల చార్జీలు ఇప్పటికే అధికంగా ఉండడంతో యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. హెచ్‌టీ కేటగిరీలోని పారిశ్రామికవాడలు, ఆధ్యాతి్మక స్థలాలు, సాగునీటి పథకాలు, తాగునీటి పథకాలు, రైల్వే ట్రాక్షన్, మెట్రో రైలు, టౌన్ షిప్పులు/రెసిడెన్షియల్ కాలనీలు, చార్జింగ్ స్టేషన్లకు సంబంధించిన 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యమున్న కనెక్షన్లకు ఒకే తరహా చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో వీటికి చార్జీల పెంపు వర్తించకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment