కొండంత వెలుగు.. గోరంత బిల్లు
సాక్షి, రాజమండ్రి : వినియోగ చార్జీలకు తోడు ఇంధన సర్దుబాటు చార్జీలు, సర్‌చార్జీలు తడిసిమోపెడై.. నెల బడ్జెట్‌పై పెద్ద భారమవుతున్నాయి. ఈ తరుణంలో.. నెలకు 150 యూనిట్లలోపు వినియోగించిన వారికి కేవలం రూ.100 మాత్రమే బిల్లు వచ్చేలా చూస్తామన్న జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ.. ప్రజలకు మండుటెండలో మంచుకొండ మీది నుంచొచ్చిన గాలి సోకినంత ఉపశమనాన్ని ఇస్తోంది. ఆయన ముఖ్యమంత్రై.. ‘కొండంత వెలుగుకు గోరంత బిల్లు’ కట్టే రోజు రావాలని కాంక్షిస్తున్నారు.
ఉక్కపోసే వేళ ‘ఫ్యాన్’ గాలి కోసం తహతహలా..
జిల్లాలో 12.20 లక్షల గృహ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 40 శాతం అంటే సుమారు 4.80 లక్షలకు పైగా నెలకు 150 యూనిట్లలోపు వినియోగించేవేనని అంచనా. ఒక కుటుంబం గరిష్టంగా 150 యూనిట్ల విద్యుత్తు వినియోగిస్తే ప్రస్తుతం యూనిట్ ధర ప్రకారం రూ.540 అవుతుంది. దీనికి విద్యుత్తు సుంకం, ఇతర సర్‌చార్జీలు తోడై బిల్లు రూ.750 నుంచి రూ.800 వరకూ వస్తుంది. కానీ నెలకో విధంగా ఇంధన సర్దుబాటు చార్జీలు విధిస్తుండడంతో వినియోగదారులు 150 యూనిట్లకు ఒక్కోసారి రూ.1000 నుంచి రూ.1,200 వరకూ కూడా బిల్లు కట్టాల్సి వస్తోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లో వేసవిలో వినియోగం నెలకు కనీసం 150 యూనిట్లు ఉంటుంది. వీరంతా కరెంటు బిల్లులకే అధికంగా చెల్లించాల్సి వస్తోంది. జగన్ హామీ నెరవేరితే ఆ బిల్లు కాస్తా రూ.100తో సరిపోతుంది.పెనుభారంగా మారిన విద్యుత్ బిల్లుల బెడద నుంచి తెరిపిన పడేరోజు కోసం ప్రజలు.. ‘ఉక్కపోసే వేళ ‘ఫ్యాన్’ గాలి కోసం తహతహలాడినట్టు’ ఎదురు చూస్తున్నారు.
ఆ హామీ అమలైతే గొప్పవరం..
కోరుకొండ మండలం బూరుగుపూడి ఎస్సీ కాలనీలో జోగు లక్ష్మి తమ ఇంటికి ప్రతి నెలా రూ.1000 నుంచి రూ.1,500 వరకూ కరెంటు బిల్లు వస్తోందని వాపోతోంది. ఒక ఫ్యాన్, రెండు లైట్లకు ఇంత బిల్లు రావడమేమిటని ఈ కుటుంబం గగ్గోలు పెడుతోంది. రెక్కాడితేకాని డొక్కాడని పరిస్థితిలో బిల్లులు కట్టడానికి తలకిందులవుతున్నామని మొత్తుకుంటోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యి.. 150 యూనిట్లకు రూ.వంద మాత్రమే వసూలు చేస్తామనడం తమలాంటి వారికి గొప్ప వరం అంటోంది.
కరెంటు కష్టాలు తీరతాయని ఆశిస్తున్నాం..
నేను మండల కేంద్రమైన రంగంపేటలో సామాన్య రైతును. మాది ముగ్గురి కుటుంబం. అయినా బిల్లు వెయ్యికి పైగా వచ్చిం ది. తాజాగా బిల్లు రూ.1,065కు వచ్చింది. వినియోగం 150 యూనిట్ల లోపే అయినా సర్‌చార్జీలు, సర్దుబాటు చార్జీలు కలిపి తడిసి మోపెడయింది. జగన్ హామీ నెరవేరితే మావంటి వాళ్లకు చాలా ఊరటగా ఉం టుంది. ఆయన సీఎం అవుతారని, కరెంటు కష్టాలు విరగడవుతాయని ఆశిస్తున్నాం.
- పోతుల సత్తిబాబు, రైతు, రంగంపేట
పేదల ఆకాంక్ష అదే..
ఇద్దరు పిల్లలతో ఉన్న మాకు కూడా వెయ్యిరూపాయలు పైగా బిల్లు వచ్చేస్తోంది. వాడకం మాత్రం 150 యూనిట్ల లోపే ఉంటోంది. నెల నెలా ఇంత బిల్లు కట్టలేక పోతున్నాం. ఇలాంటి తరుణంలో జగన్ .. పేదవారికి విద్యుత్ భారం తగ్గిస్తామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నారు. అవి నెరవేర్చుతారనే ఆశ ప్రతి పేదవాడిలో ఉంది.
- షేక్ అహ్మద్ ఆలీ (బాబులు), సైకిల్‌షాపు మెకానిక్, రంగంపేట
ప్రాణం పోశారు
మాది తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం శివారు పెదపేట. నాపేరు కుంచే బాలయోగి. నాకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్యా పిల్లలను పోషించుకోవడానికి కూలి పనిచేసుకుంటూ ఎంతో కష్టపడేవాణ్ణి. ఒకరోజు సడన్‌గా గుండెనొప్పి వచ్చి ఆయాసం వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించుకున్నాను. మా గ్రామానికి సమీపంలో ఉన్న పల్లంకుర్రులో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్యశ్రీ వైద్యశిబిరంలో పరీక్షలు చేయించుకున్నాను. వెంటనే గుండెజబ్బుకు ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. నా భార్య, పిల్లలు ఒక్కసారిగా దిగులు చె ందారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా పాలిట వరమైంది. ఆ పథకంలో విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో 2010లో బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. రూ. 1.40 లక్షలు ఖర్చయిన ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు. ఆ మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పుణ్యమా అని భార్యా పిల్లలతో ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు ఇలా ఉన్నామంటే ఆయన చలవే. ఆయన రుణం తీర్చుకోలేనిది.
- న్యూస్‌లైన్, ముమ్మిడివరం